డబ్బు , అధికారం , శృంగారం ఇలా సర్వ సుఖాలను అనుభవించాలని మనుషులు నిరంతరం పాకులాడుతూనే ఉంటారని , కానీ జీవిత సత్యం అది కాదని …….. కోరికలను జయించడమే మానవాళికి సర్వశ్రేష్ఠమైనదనే విషయాన్ని ” యోగి వేమన ” చిత్రంలో చక్కటి సందేశం ఇచ్చారు దర్శక నిర్మాతలు. 1947 లో భారతదేశానికి స్వాతంత్య్రం సిద్దించిన విషయం తెలిసిందే. అలా దేశం స్వేచ్ఛా వాయువులను పీల్చిన సమయంలోనే విడుదలైన చిత్రం ఈ యోగి వేమన.
అప్పట్లో చిత్తూరు నాగయ్య అంటే సంచలనమే ! ఆరోజుల్లో అత్యధిక పారితోషికం అందుకునే నటుల్లో చిత్తూరు నాగయ్య నెంబర్ వన్ గా ఉండేవారు. యోగి వేమన పాత్రకు ప్రాణప్రతిష్ట చేసారు చిత్తూరు నాగయ్య. తనదైన అద్భుత నటనతో ప్రేక్షకులను అలరించారు. ఇక దర్శకుడు కెవి రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 1947 లోనే …….. అప్పటి మనుషులు డబ్బు కోసం , ఆస్తుల కోసం , అధికారం కోసం , శృంగార జీవితం కోసం ఎలా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారో కళ్ళకు కట్టినట్టు చూపించారు.
అలాగే మానవాళి సౌబ్రాతృత్వం కోసం మనసుని అదుపులో పెట్టుకోవాలని , కోరికలను జయించిన మీదటే అసలైన మనిషి ఉద్భవిస్తాడని , మానవత్వం సిద్ధిస్తుందని చక్కని సూక్తులు చెప్పారు …….. జీవిత పరమార్థం తెలియజేసారు. ఆరోజుల్లోనే ఇలాంటి చక్కని సందేశాన్ని మానవాళికి అందించారు చిత్తూరు నాగయ్య , కెవి రెడ్డి. అయితే 75 సంవత్సరాల తర్వాత మనుషులలో కోరికలు మరింత రాక్షసంగా తయారయ్యాయి. తాము బ్రతకడానికి ఎదుటి వాళ్ళను ఎంతటి నాశనానికి అయినా సరే పూనుకునేలా దిగజారి ప్రవర్తిస్తున్నారు. ఇదంతా విలాసవంతమైన జీవితం కోసం చేస్తున్నప్పటికీ జీవిత చరమాంకంలో మాత్రం ఆ శిక్షను ఇక్కడే అనుభవిస్తున్నారు.