యువ భారత్ …… భారతదేశంలో అత్యధికులు యువతరమే ! దాదాపు 53 శాతం మంది యువతీయువకులు అభినవ భారత్ సొంతం. అయితే యువత పెద్ద ఎత్తున ఉంది కానీ దేశం పట్ల , రాజకీయాల పట్ల ఇందులో చాలామందికి అవగాహన లేదు. అలాగే ఓటర్ గుర్తింపు కార్డు గురించి ఇంకా తెలియని వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు సుమా !
తాజాగా కర్ణాటకలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేటతెల్లమయింది. ఓటర్ కార్డు అంటే ఏంటో తెలియదని ఎక్కువ మంది చెప్పడం విశేషం. అలాగే భారత రాజ్యాంగం గురించి , అసెంబ్లీ నియోజకవర్గాల గురించి తెలియని వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఎలాంటి దశలో ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. 29 ఏళ్ల లోపు ఉన్న యువత ఎక్కువగా ఎలక్షన్ల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదట.
భారత రాజ్యాంగం 18 సంవత్సరాలు నిండిన యువతీయువకులకు ఓటు హక్కు కల్పిస్తోంది భారత ప్రభుత్వం. అయితే ఓటు కోసం ఓటర్ కార్డు ఎలా పొందాలో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు జాతీయ ఓటర్ పోర్టల్ లో తమ ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు. తమ ప్రాంతం ఏ అసెంబ్లీ నియోజకవర్గం కిందకు వస్తుందో తెలుసుకొని ఆన్ లైన్ లోనే అప్లయ్ చేసుకోవచ్చు. ఓటర్ నమోదు కోసం అడిగిన వివరాలను అందులో పొందుపరిస్తే చాలు ఓటర్ గా నమోదు అయినట్లే ! భావి భారతం కోసం …… సమర్థ నాయకత్వం కోసం ప్రతీ పౌరుడు తమ ఓటు హక్కు వినియోగించుకుంటేనే సరికొత్త భారతం ఉద్భవిస్తుంది. అందుకోసం యువత తమ బాధ్యతను గుర్తెరగాలని కోరుతున్నారు.