YSR Jayanthi :
వైఎస్సార్.. యదిగంటి సందింటి రాజిరెడ్డి. జననేత..పేదల హృదయాలను గెల్చుకున్న వ్యక్తిత్వం. రాజన్న అంటే నేనున్నా అనేలా తన వ్యక్తిత్వంతో అందరి మనస్సుల్లో స్థానం సంపాదించుకున్నాడు. ఆయన నవ్వు.. ఆయన ధైర్యం ఎందరికో ఆదర్శం. మాట తప్పని.. మడమ తిప్పని నైజం కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సొంతం. ఉమ్మడి రాష్ర్ట ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెరగని ముద్ర వేసుకున్నాడు. ఈ రోజు వైఎస్ పుట్టిన రోజు సందర్భంగా.. ఆయన పై ప్రత్యేక కథనం..
బాల్యం.. చదువులు
వైఎస్సార్ కడప జిల్లా సింహాద్రిపురం మండలం బలపనూర్ లో యెడగూరి రాజారెడ్డి-జయమ్మ దంపతులకు 1949 జూలై 8న జన్మించాడు. పులివెందులలోనే ప్రాథమిక విద్యాభ్యాసం కొనసాగింది. అయితే వైఎస్సార్ తో పాటు సోదరుడు వివేకా, సోదరి విమలమ్మ పులివెందులలోని వెంకటప్ప అనే ఉపాధ్యాయుడి ఇంట్లో ఉండి చదివారు. బళ్లారిలో పదో తరగతి, విజయవాడలో పీయూసీ, గుల్భార్గా ఎమ్మార్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీలో హౌస్ సర్జన్ పూర్తి చేశాడు.
గుల్బర్గా మెడికల్ కాలేజీలో విద్యార్థి సంఘం నేతగా వైఎస్ ఉన్నారు. 1978 లో మొదటి సారి పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటికి ఆయన వయస్సు 29 ఏండ్లు మాత్రమే. ఆ తర్వాత ఆరుసార్లు ఎమ్మెల్యే, నాలుగు సార్లు ఎంపీగా ఓటమెరుగని నేతగా చరిత్రలో నిలిచారు. రాష్ర్ట మంత్రిగా మూడు సార్లు పనిచేశారు .. అయితే రాష్ర్ట వ్యాప్తంగా 11 జిల్లాల పరిధిలో 1470 కి.మీ మేర ఆయన చేపట్టిన పాదయాత్ర అప్పట్లో సంచనమైంది. 2004లో ఆయన ముఖ్యమంత్రిగా అధికారంలోకి రావడానికి కారణమైంది. ఇప్పటికీ ఆయన చేసిన పాదయాత్ర రికార్డు అలాగే ఉంది. 2004,2009 లో రెండు పర్యాయాలు ఆయన ముఖ్యమంత్రిగా పని చేశారు.
సంక్షేమ రథసారథి వైఎస్..
ప్రజల నాడి బాగా తెలుసుకున్న వైఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలుత రైతులకు ఉచిత విద్యుత్ ఫైల్ మీద సంతకం చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్, పేదలకు ఆరోగ్య శ్రీ, పోలవరం ప్రాజెక్ట్, ఇలా ఎన్నింటికో ఆయన శ్రీకారం చుట్టారు. ఇక 108 అంబులెన్స్ సేవల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆపదలో ఉన్నారంటే నిమిషాల్లో వాలిపోయేవి. రెండో సారి అధికారంలోకి వచ్చిన 2009లో సెప్టెంబర్ 2న రచ్చబండ కార్యక్రమం కోసం బయలుదేరి హెలిక్యాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసువులు బాసారు. ఆరోజు వైఎస్ లేడన్న సంగతి తెలిసి ఎన్నో గుండెలు ఆగిపోయాయి. కన్నీరొలకని మనిషి లేడు. నిజమే ఆయన జనహృదయ నేత. చిరస్మరణీయుడు. రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు ఇలా పథకమేదైనా మొదటగా గుర్చొచ్చేది వైఎస్సే. జోహార్ వైఎస్సార్.. నేడు వైఎస్ జయంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ర్టాలు ఆయనను స్మరించుకుంటున్నాయి.