
YS Sharmila question to KCR : వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల దూకుడు పెంచింది. అధికార పార్టీ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం పై ఆమె ఎప్పటికప్పుడు ఫైట్ చేస్తున్నారు. ఇప్పటికే పాదయాత్రలు నిర్వహిస్తూ రైతులు, యువతను పలకరించి వారి కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యారు. సోమేశ్ కుమార్ ను సీఎం ముఖ్య సలహాదారుడిగా నియమించుకోవడంపై షర్మిల స్పందించారు. అసలు సలహాలే తీసుకోని సీఎంకు ప్రత్యేకంగా సలహాదారుడు ఎందుకు అంటూ ప్రశ్నించారు.
నియంతలా వ్యవహరించే కేసీఆర్ ఇంకో వ్యక్తి నుంచి సలహాలు తీసుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కేసీఆర్ అవినీతిపై నోరు మెదపకుండా చేసేందుకే సోమేశ్ కుమార్ ను నియమించుకున్నారని ఆరోపించారు. తెలంగాణను సీఎం బ్రష్టు పట్టించాడని, ఒంటెద్దు పోకడతో నాశనం చేశాడని మండిపడ్డారు. ఎన్నో శాఖలకు కమిషన్లు లేక ప్రజలు సతమతం అవుతుంటే దొరకు దోచిపెట్టే వాడిని మాత్రం సలహాదారుడిగా పెట్టుకున్నారని షర్మిల ధ్వజమెత్తారు.
ఇక్కడ పుట్టి ఉద్యమాలు చేసిన ఇక్కడి బిడ్డలకు ఉద్యోగాలు లేవు కానీ.. పక్క రాష్ట్రం వారిని మాత్రం లక్షలకు లక్షలు జీతం ఇచ్చి మేపుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల పన్నులతో జీతాల తీసుకుంటూ దొర కుటుంబానికి పని చేస్తున్నారని ఆరోపించారు. రుణమాఫీ అమలుపై సలహా ఇచ్చేవారా..? లేక లక్షా 91వేల ఉద్యోగాలను భర్తీ చేయమని సలహా ఇచ్చేవారా..? అంటూ షర్మిల తీవ్రంగా మండిపడ్డారు.
రాష్ట్రంలో ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఉద్యోగం ఇవ్వడం చేతకాదు గానీ.. పక్క రాష్ట్రంలో మీ పార్టీ వ్యక్తికి రూ. 18 లక్షలతో ప్యాకేజీ ఇస్తావా అని షర్మిల ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. మహారాష్ట్రకు చెందిన మర్కడ్ శరద్(Markad Sharad) బాబాసాహెబ్ అనే యువకుడిని సీఎం ప్రైవేట్ సెక్రటరీగా నియమించుకున్నాడు. నెలకు రూ. లక్షన్నర జీతంతో రెండేళ్లు ఆయన ఈ హోదాలో ఉంటారని ప్రభుత్వం జీవో జారీ చేసింది.
ఇప్పుడు సోమేశ్ కుమార్ కు లక్షలాది రూపాయల జీతం. ఈ డబ్బులన్ని ఎక్కడివి అనుకుంటున్నావు కేసీఆర్ అంటూ మండిపడ్డారు. శరద్ గత నెల 10వ తేదీ కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. కార్పొరేట్ ఉద్యోగి సంవత్సరానికి రూ. 5 లక్షల ఆఫర్‌ను తిరస్కరించి బీఆర్ఎస్‌లో చేరినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. దీనిపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు షర్మిల.