
YS Viveka murder : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి హైకోర్టుకు సమర్పించిన అనుబంధ కౌంటర్ లో సీబీఐ కీలక విషయాలను ప్రస్తావించింది. వివేకా మృతి విషయం సీఎం జగన్ కు ఉదయం 6 గంటలకు ముందే తెలుసునని దర్యాప్తులో తేలిందని చెప్పింది. జగన్ కు పీఏ కృష్ణారెడ్డి చెప్పకముందే హత్య విషయం తెలుసునని, అయితే చెప్పింది అవినాషేనని తమకు కొన్ని అనుమానాలున్నాయని న్యాయ స్థానం దృష్టికి తీసుకెళ్లింది.
హత్య జరిగిన రోజు రాత్రి అవినాష్ వాట్సాప్ కాల్స్ మాట్లాడారు. దీనిపై విచారణ జరగాల్సి ఉంది. కానీ ఆయన విచారణకు సహకరించడం లేదని కౌంటర్లో పేర్కొంది. జూన్ 30లోగా విచారణ పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో అవినాష్ కు బెయిల్ ఇవ్వద్దని చెప్పింది. అయితే సునీత, అవినాష్ న్యాయవాదుల వాదనలు విన్న బెంచ్, విచారణను శనివారానికి వాయిదా వేసింది. మరోవైపు సీబీఐ వాదనలను కూడా పూర్తిస్థాయిలో వినాల్సి ఉంది.
జగన్ పేరు చేర్చడంపై న్యాయవాదుల అభ్యంతరం..
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య విషయం జగన్ కు ముందే తెలుసునని సీబీఐ పేర్కొనడంపై జగన్ తరపు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు. దీని వెనుక కుట్ర కోణం ఉందని భావిస్తున్నారు. దీనిపై న్యాయపరంగా ముందుకెళ్లాలని యోచిస్తున్నారు. మరోవైపు సీబీఐ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జగన్ పేరు చేర్చడం దారుణమని పేర్కొన్నారు. సడన్ గా జగన్ పేరు చేర్చడం చిల్లర చేష్టగా అభివర్ణించారు. మరి శనివారం సీబీఐ వినిపించే వాదనల్లో మరెన్ని అంశాలు బయటకు రానున్నాయో తెలియనుంది.
అయితే అవినాష్ రెడ్డి పూర్తి స్థాయిలో ఇక మునిగిపోయినట్లేనని, ఏపీ సీఎం జగన్ పాత్రపై కూడా తమకు ముందు నుంచే అనుమానాలున్నాయని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఏదేమైనా నిస్పక్షపాతం సీబీఐ దర్యాప్తును ముందుకు తీసుకెళ్తున్నదని కొనియాడుతున్నారు. ఒత్తిళ్లు వచ్చినా సీబీఐ అధికారులు ముందుకెళ్లడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.