- 100 రోజులు పూర్తిచేసుకున్న యువగళం పాదయాత్ర

Yuvagalam : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ యువగళం పేరిట పాదయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పాదయాత్ర సోమవారానికి 100 రోజులకు చేరుకుంది. అయితే సోమవారం తల్లి నారా భువనేశ్వరి, నందమూరి, నారా కుటుంబ సభ్యులు ఆయన వెంట నడిచారు. పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు వెంట వస్తుండగా, లోకేశ్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అయితే లోకేశ్ వంద రోజుల పాదయాత్ర ద్వారా ఆయనకు వంద మార్కులు పడినట్లేనా..
వంద మార్కులు పడినట్లేనా..
టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయాల్లో సీనియర్. 40 ఏండ్ల రాజకీయ ప్రస్థానం ఆయనది. తన వారసుడికి పార్టీలో కీలక స్థానం అప్పగించారు గతంలో అధికారంలో ఉండగా, ఎమ్మెల్సీగా చేసి, ఏకంగా మంత్రి పదవి కట్టబెట్టారు. 2019 ఎన్నికల్లో లోకేశ్ మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పప్పు అంటూ ఆయనపై పెద్ద ప్రచారమే జరిగింది. అయితే కొంత కాలంగా ఆయనలో కొంత మార్పు కనిపిస్తున్నది. జగన్ సర్కారుపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. తాను తండ్రిలా సాఫ్ట్ కాదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వైసీపీకి చుక్కలేనని పదేపదే హెచ్చరిస్తున్నారు.
అయితే ఇటీవల ఆయన చేపట్టిన యువగళం పాదయాత్ర 100రోజులకు చేరింది. ఎన్నో నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర కొనసాగింది. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఫొటోలు, సెల్ఫీలతో హోరెత్తిస్తున్నారు. గతంలో టీడీపీ చేసిన పనులు, అధికారంలోకి వస్తే చేసే పనులు చెబుతున్నారు. పేదలు, రైతులతో కలిసిపోతూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. పార్టీ కోసం ఎంత కష్టానికైనా సిద్ధమేనని ఆయన సంకేతాలిస్తున్నారు. వైసీపీ పెట్టిన కేసులతో ఇబ్బందులు పడుతున్న టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసానిస్తున్నారు.
రానున్న రోజుల్లో రాబోయేది మన ప్రభుత్వమేనని, వైసీసీకి దీటుగా సమాధానమిద్దామని చెబుతున్నారు. మరోవైపు చిన్నాపెద్ద అందరితో చనువుగా మాట్లాడుతూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా యువతతో సరదాగా మాట్లాడుతూ పార్టీని గెలిపించాలని కోరుతున్నారు. ఇప్పటికైతే లోకేశ్ చేపట్టిన పాదయాత్రకు పాజిటివ్ టాక్ వచ్చిందని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇక ఆయనకు ప్రజల నుంచి వంద మార్కులు పడ్డట్లేనని స్పష్టం చేస్తున్నాయి. ఏదేమైనా లోకేశ్ రానున్న రోజుల్లో రాజకీయాల్లో ఎలా నెట్టుకురాగలడో వేచి చూడాలి. తండ్రిలా రాజకీయ చతురతతో లేకపోతే ఇబ్బందులు తప్పవని, ప్రత్యర్థి మరింత బలంగా మారే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.