భారత రాజకీయాలపై చెరగని ముద్ర వేసిన నాయకులలో ఐరన్ లేడీ ఇందిరాగాంధీది అగ్రస్థానం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. భారత మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కూతురుగా రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసినప్పటికీ అతి తక్కువ కాలంలోనే తన ప్రతిభతో నాయకత్వ లక్షణాలను యావత్ ప్రపంచానికి చాటి చెప్పింది. ఇందిరాగాంధీ కేవలం భారతదేశ నాయకురాలు మాత్రమే కాదు ప్రపంచంలోనే మేటి అనదగ్గ నాయకురాలిగా ఎదిగింది. ప్రపంచంలోనే ఐరన్ లేడీ అంటే టక్కున గుర్తొచ్చే పేరు వన్ అండ్ ఓన్లీ ఇందిరాగాంధీ.
తండ్రి అడుగు జాడలలో అడుగులు వేసిన ఇందిర తన తండ్రి మరణం తర్వాత భారతదేశానికి 1966 లో మొదటిసారిగా ప్రధానమంత్రి అయ్యింది. మొత్తంగా నాలుగు పర్యాయాలు దేశ ప్రధానిగా పనిచేసింది. సువిశాల భారతదేశంలో నాయకురాలిగా ఎగదడం అంటే మాటలు కాదు. అనితరసాధ్యమైన విజయాలను ఎన్నింటినో సాధించి కొత్త చరిత్ర సృష్టించింది. పరిపాలనలో తనదైన ముద్ర వేసింది. ప్రజలకు పెద్ద ఎత్తున సంక్షేమ ఫలాలను అందించింది ముమ్మాటికీ ఇందిరాగాంధీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే ఎన్ని విజయాలు సాధించినప్పటికీ ఇందిరాగాంధీ జీవిత చరిత్రలోనే కాదు యావత్ భారతదేశంలోనే చీకటి రోజులు అంటే ఇందిరా విధించిన ” ఎమర్జెన్సీ ” అనే చెప్పాలి. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ దేశ రాజకీయాలను కీలక మలుపులు తిరిగేలా చేసింది. ఇక అమృత్ సర్ స్వర్ణదేవాలయంలో తీవ్ర వాదులు తల దాచుకుంటే బ్లు స్టార్ ఆపరేషన్ పేరుతో తీవ్రవాదులను ఏరివేసిన ధీశాలి ఇందిర. అంతేకాదు పాకిస్థాన్ ను ఓడించి బాంగ్లాదేశ్ విముక్తికి పాటుపడిన వీర వనిత మన ఇందిరా.
అయితే ఎంతటి వాళ్ళనైనా ఎదురించే ధీరవనిత ఇందిరాగాంధీ 1984 అక్టోబర్ 31 న తన అంగరక్షకుల చేతిలో బుల్లెట్ల వర్షానికి బలి అయ్యింది. యావత్ జాతి శోకసంద్రంలో మునిగింది. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ఐరన్ లేడీ ఇందిరాగాంధీని స్మరించుకుంటోంది జైస్వరాజ్యడాట్ టీవీ.