Shri Krishna Janmashtami: దేవాది దేవుడు.. గోపాలకుడు.. గోపికా వల్లభుడు.. శ్రీ కృష్ణుడి పుట్టిన రోజు ఈ రోజు (సెప్టెంబర్ 07). ఉదయాన్నే ఆలయాలు భక్తులతో నిండిపోగా.. ఇంట్లో ఉన్న చిన్న చిన్న బాబులు, పాపలకు గోపికా.. శ్రీకృష్ణుడి వేషం వేస్తూ ఆనందం పొందారు భక్తులు. ఇక కొత్తగా పెళ్లయిన జంటలు తమ ఇంటికి బుడి బుడి నడకలతో శ్రీకృష్ణుడు రావాలని కృష్ణ పాదాలను వేశారు. ఇలా స్వామి వారిని కొలిచారు.
ఇక శ్రీకృష్ణ జన్మాష్టమి అంటేనే గుర్తుకు వచ్చే పాట ‘పాండురంగ మహత్యం (1957)’ సినిమాలోనిది. దివంగత ఎన్టీ రామారావు తన గురువు పాదాలను ఒళ్లో పెట్టుకొని నొక్కుతూ పాడిన ఈ పాట నిజంగా వీనుల విందనే చెప్పాలి. భక్తి పారవశ్యంతో ఎన్టీఆర్ పాడుతుంటూ తన గురువుగారు సేద దీరుతారు. పాండురంగ మహాత్మ్యం 1957 నవంబరు 28న విడుదలైన తెలుగు చలనచిత్రం. కమలాకర కామేశ్వరరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, అంజలీదేవి, బీ సరోజాదేవి, నాగయ్య, కస్తూరి శివరావు, పద్మనాభం, ఋష్యేంద్రమణి, ఛాయాదేవి, పేకేటి శివరాం తదితరులు నటించారు.
ఈ సినిమాకు సంగీత దర్శకత్వం టీవీ రాజు వహించగా, సముద్రాల పాటలను రాశారు. ఇక గాత్రం అందించింది గొప్ప వాగ్గేయకారుడు ఘంటసాల. ఏడు దశాబ్దాలకు పైగా వచ్చిన ఈ పాట ఇప్పటికీ శ్రీకృష్ణుడిని తలుచుకుని కన్నులు మూసుకుంటే వినిపించేది. ప్రతీ శ్రీకృష్ణ జన్మాష్టమికి ఈ పాట తప్పనిసరి వినిపిస్తుంది.