- మత రాజకీయాలపై సౌత్ దెబ్బ

South States : భారతీయ జనతా పార్టీ.. గతం వేరు.. ప్రస్తుతం వేరు.. రథయాత్ర ద్వారా ధర్మ పరిరక్షణ అంటూ అధికారంలోకి వచ్చిన ఈ పార్టీని ఉత్తరాది తన భుజస్కంధాలపై ఎత్తకుంది. కానీ సౌతిండియాలో ని బీజేపీ కి ఎదురు దెబ్బలు తలుగుతున్నాయి. ఒకే రకమైన విధానాలతో ముందుకెళ్తున్న బీజేపీని దక్షిణాది ప్రజలు తిరస్కరిస్తూనే వస్తున్నారు. గతంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. మరో వైపు రెండు పర్యాయాలు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీకి ప్రస్తుతం ఉత్తరాదిలో కూడా కొంత వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లుగా నేషనల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతున్నది. త్వరలో జరిగే మరో ఐదు రాష్ర్టాల ఎన్నికలు కూడా ఇవే ఫలితాలు చూపితే ఇక బీజేపీ కొట్టుకుపోవడం ఖాయమని చెబుతున్నారు.
కర్ణాటకలో పారని విద్వేష పాచిక..
మతం ప్రాతిపాదికన చేసే రాజకీయాలు సౌతిండియాలో చెల్లవని కర్ణాటక మరోసారి నిరూపించింది. అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై తమ ఆలోచనలను ప్రకటించకుండా కేవలం మతం అంటూ విద్వేషాలు చేస్తూ కూర్చుంటే ఇలా కర్ర కాల్చి వాత పెడుతారని మరోసారి నిరూపితమైంది. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ర్ట, తెలంగాణ ఇలా అన్ని రాష్ర్టాల్లో బీజేపీ తీరు వివాదాస్పదమవుతున్నది. రానున్న రోజుల్లో ఇలాగే కొనసాగితే సౌతిండియాలో బీజేపీకి చోటే లేకుండా పోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత తొమ్మిదేండ్ల పాలన లో బీజేపీ చేసిన మంచి పనులేంటో చెప్పకుండా ఎక్కడ ఎన్నికలుంటే అక్కడ విద్వేషాలు, నిధుల వరద కురిపిస్తూ రాజకీయాలను కలుషితం చేస్తున్నదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మోదీ, అమిత్ షా, నడ్డా ల ఆధ్వర్యంలో తాము చూడాల్సింది ఇలాంటి బీజేపీ కాదని.. భారత సర్వతోముఖాభివృద్ధి కి పాటుపడేలా ఈ త్రయం పని చేయాలని స్వయంగా ఆ పార్టీ నేతలే కోరుతున్నారు. వాజ్ పాయ్, అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుష్మాస్వరాజ్ లాంటి నేతలను బీజేపీలో చూశామని, గతంలో వారిలో ఉన్న రాజకీయ స్నేహపూర్వక వాతావరణం, ప్రస్తుతం కనిపించడం లేదని ఆయా రాష్ర్టాల సీనియర్ రాజకీయ నేతలు చెబుతున్నారు.
ఉత్తరాది అయినా మిగిలేనా..
దక్షిణాదిలో బీజేపీ తుడిచి పెట్టుకుపోయింది. దక్షిణాది పై ఆది నుంచి వివక్ష చూపుతున్నదని విమర్శలు మూటగట్టుకునన బీజేపీ ఇప్పుడు ఉత్తరాది లో కూడా వ్యతిరేక పవనాలు ఎదుర్కొంటే ఇక మోదీ గాలి ముగిసినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కర్ణాటక ఓటమితో ఇప్పుడు ఆయనకు కొంత డ్యామేజ్ కలిగించే అంశమేనని అభిప్రాయపడుతున్నది. ఆయన చెప్పాల్సింది తన మన్ కీ బాత్ కాదని, ప్రజల మనసులో ఏ ముందో తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ప్రధాని స్థాయిలో ఆయన వ్యవహరించిన తీరే బీజేపీ పతనానికి కారణమవుతున్నదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నది. ఏదేమైనా రానున్న రోజుల్లో బీజేపీ ఇదే డ్రాప్ కొనసాగిస్తే ఇక ఉత్తరాది కూడా మిగలడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.