
భారతదేశ చరిత్రలో చెరిగిపోని మారణకాండ ” జలియన్ వాలాబాగ్ ”. బ్రిటీష్ సైనికుల దురహంకారానికి 1000 మందికి పైగా మృత్యువాత పడగా 2000 మంది వరకు గాయపడ్డారు. అయితే ఆనాటి బ్రిటిష్ లెక్కల ప్రకారం 379 మంది మాత్రమే మరణించినట్లుగా దొంగ లెక్కలు చూపించారు. ఆ సంఘటన భారతీయులను తీవ్రంగా కలిచి వేసింది. స్వాతంత్య్ర పోరాటం మరింత తీవ్రం కావడానికి దోహదపడింది కూడా.
భారతదేశ స్వాతంత్య్రం కోసం పంజాబ్ లోని అమృత్ సర్ లో గల ఒక తోట ” జలియన్ వాలాబాగ్ ”. 1919 ఏప్రిల్ 13 న పంజాబీలకు న్యూ ఇయర్ కావడంతో పంజాబీలంతా జలియన్ వాలాబాగ్ లో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న నరరూప రాక్షసుడు జనరల్ డయ్యర్ బ్రిటీష్ సైనికులతో జలియన్ వాలాబాగ్ లో సమావేశమైన భారతీయులపై బుల్లెట్ల వర్షం కురిపించాడు.
పారిపోవడానికి మరో దారి లేదు , చుట్టూ ఎత్తైన గోడలు దాంతో హాహాకారాలు చేస్తూ పారిపోవడానికి వేలాది మంది చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కొంతమంది ఆ కాల్పుల నుండి తప్పించుకోవడానికి జలియన్ వాలాబాగ్ లో ఉన్న బావిలోకి దూకి మరణించారు. అలాగే డయ్యర్ కాల్పులకు మహిళలు , పిల్లలు , యువకులు , వృద్దులు ఇలా అందరూ మరణించారు.
మొత్తంగా 1000 మంది చనిపోగా అప్పటి ప్రభుత్వం మాత్రం 379 మంది మాత్రమే మరణించినట్లు పేర్కొనడం గమనార్హం. 2000 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఈ సంఘటన యావత్ ప్రపంచాన్ని కలిచి వేసింది. ఈ సంఘటన జరిగి నేటికి సరిగ్గా 103 సంవత్సరాలు. దాంతో భారత ప్రభుత్వం ఆనాటి అమరవీరులను స్మరించుకుంటూ పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది.






