KCR Hatavo : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉత్సాహంగా కనిపిస్తున్నది. రాష్ట్రంలో బీఆర్ఎస్ ను ఎదుర్కొనే సత్తా ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందని ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఇటీవల పార్టీలో చేరికల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే తాజాగా మహబూబ్నగర్, ఖమ్మం నిజామాబాద్ జిల్లాలకు చెందిన కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
ఇదిలా ఉంచితే.. సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీని తెలంగాణ ప్రాంతానికి చెందిన 35 మంది నేతలు కలిశారు. ఇందులో మహబూబ్నగర్ ఖమ్మం నల్గొండ జిల్లాలకు చెందిన నేతలు ఉన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మధుయాష్కి షబ్బీర్ అలీ, జానా రెడ్డి, కేసీ వేణుగోపాల్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపెల్లి కృష్ణారావు, అరికెల నర్సారెడ్డి సహా మరికొందరు నేతలు ఇందులో ఉన్నారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణలో ఘర్ వాపసీ కార్యక్రమం కొనసాగుతున్నదన్నారు. పార్టీని విడిచిన నేతలంతా తిరిగి రావడం ఆనందంగా ఉందన్నారు. కేసీఆర్ హటావో తెలంగాణ బచావో కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ దిశగా కృషి చేయాలని సూచించారు. సమిష్టిగా పని చేసే పార్టీని అధికారంలోకి తేవాలని సూచించారు. కాగా, పార్టీలో చేరే నేతలంతా జులై రెండున ఖమ్మం సభకు రావాలని రాహుల్ గాంధీ, మల్లికార్జున కార్గేను ఆహ్వానించారు. అదే సభలో తాము పార్టీ కండువా కప్పుకొనున్నట్లు చెప్పారు.