ఎట్టకేలకు సినీ నటి కుష్భు కు కీలక పదవి కట్టబెట్టింది మోడీ సర్కార్. జాతీయ మహిళా సభ్యురాలిగా కుష్భును నియమించారు. తనని జాతీయ మహిళా సభ్యురాలిగా కీలక మైన పదవిలో నియమించినందుకు ఉబ్బి తబ్బిబై పోతోంది కుష్భు. లెటర్ ద్వారా ఫిర్యాదు చేసినా సరే స్పందిస్తానని అంటోంది. మహిళలపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతీ రోజూ వందలాది సంఘటనలు జరుగుతున్నాయి. దాంతో అలాంటి వాళ్ళ బాధలను తన వంతు బాధ్యతగా తీర్చడానికి ఎల్లప్పుడూ ముందుంటానని అంటోంది కుష్భు. గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసింది కుష్భు. అయితే ఆ తర్వాత మాత్రం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరింది.
అప్పటి నుండి పార్టీ కోసం బాగానే కష్టపడుతోంది. తనకు ఏదైనా పదవి వస్తుందేమో అని ఆశించింది. అయితే అలాంటిదేమి వచ్చేలా కనిపించడం లేదని నిరాశలో ఉన్న సమయంలో అనూహ్యంగా జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలిగా నియమించడంతో సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇక కుష్భు కు కీలక పదవి లభించడంతో మెగాస్టార్ చిరంజీవితో పాటుగా పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు.