ఆంధ్రప్రదేశ్ లో మా పార్టీ ఎదుగుతోంది…… జనసేన తో కలిసి 2024 లో అధికారం చేపట్టిబోతున్నామంటూ ఊహలోకల్లో తేలుతున్న భారతీయ జనతా పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది ఆత్మ సాక్షి సర్వే. తాజాగా ఈ సంస్థ ఏపీలో తక్షణం ఎన్నికలు వస్తే అధికారం దక్కించుకునేది ఎవరు అంటూ 175 నియోజకవర్గాలలో సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో భారతీయ జనతా పార్టీకి కనీసం ఒక్క సీటు కూడా దక్కడం లేదు. అంటే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీకి అసెంబ్లీలోకి ప్రవేశం లేదన్నమాట.
అసలు వాస్తవం ఇలా ఉంటే భారతీయ జనతా పార్టీ నాయకులు మాత్రం 2024 లో మేము అధికారంలోకి రాబోతున్నాం….. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అంటూ వ్యాఖ్యానించి నవ్వుల పాలు అవుతున్నారు. ఇక జనసేన మా మిత్రపక్షం అంటూ బీజేపీ వాళ్ళు హడావుడి చేయడమే తప్ప జనసేన మాత్రం బీజేపీ తో మాత్రమే పొత్తు పెట్టుకుంటామని చెప్పడం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జాగ్రత్త పడతామంటూ టీడీపీ పొత్తు కోసం తహతహలాడుతోంది.
ఇక జనసేన ఒకవేళ బీజేపీ తో మాత్రమే పొత్తు అని స్పష్టం చేసినా బీజేపీ కి ఓనగూడే ప్రయోజనం ఏమి లేదు. ఎందుకంటే జనసేన కు కేవలం 7 స్థానాలు మాత్రమే దక్కుతాయని తాజా సర్వే చెబుతోంది. దాంతో బీజేపీ కి 2024 లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఘోర పరాభవం తప్పదని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఈ సర్వే ని తప్పు పడుతున్నారు బీజేపీ నాయకులు. 2024 ఎన్నికల్లో మా సత్తా చూపిస్తామని అంటున్నారు.