అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించిన మహా యోధురాలు ” సావిత్రిబాయి ఫూలే ”. సమాజంలో వేళ్లూనుకుపోయిన దురాచారాలను , సంప్రదాయాలతో పేరుతో మహిళల అభ్యున్నతిని నీరుగార్చుతుంటే ఆడది అంటే అబల కాదు సబల అని నిరూపించిన ధీశాలి ఫూలే. నిమ్న జాతిని దూరం పెడుతూ వాళ్ళను చూస్తే , ముట్టుకుంటే మహా పాపం చేసినట్లుగా భావించే సమాజంలో శూద్రుల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయురాలు సావిత్రిబాయి ఫూలే.
మహారాష్ట్ర లోని సతారా జిల్లాలోని నయాగావ్ అనే గ్రామంలో 1831 జనవరి 3 న జన్మించింది సావిత్రి బాయి. అప్పట్లో చిన్న పిల్లలకు పెళ్లిళ్లు అయ్యేవన్న విషయం తెలిసిందే. సావిత్రిబాయి కి 9 సంవత్సరాలు రాగానే జ్యోతిరావు ఫూలే తో 1840 లో పెళ్లి చేసారు. అప్పుడు జ్యోతిరావు ఫూలే వయసు 12 కాగా సావిత్రిబాయి వయసు 9 మాత్రమే . అయితే ఆమెకు అప్పుడు చదువు రాదు. దాంతో భర్త జ్యోతిరావు ఫూలే ఆమెకు గురువుగా మారి చదువు చెప్పాడు.
విద్యాభ్యాసం పూర్తయ్యాక భర్తతో కలిసి బాలికల చదువుల కోసం మొట్టమొదటి పాఠశాలను పూణేలో ప్రారంభించింది. సమాజంలో మహిళలు వెనుకబడిపోవడానికి కారణం చదువు లేకపోవడమే అని భావించి మహిళల కోసం అహర్నిశలు శ్రమించింది. సమాజంలో మార్పుకు శ్రీకారం చుట్టింది. జ్యోతిరావు ఫూలే – సావిత్రిబాయి ఫూలే దంపతుల చర్యలు అగ్రవర్ణాలకు తీవ్ర ఆగ్రహం కలిగించాయి. సమాజానికి దూరంగా ఉండే నిమ్న వర్గాల కోసం పనిచేసే ఈ దంపతులను సమాజం వెలివేసింది. అయితే ఎన్ని ఆంక్షలు విధించినా అగ్రవర్ణాలను ఎదుర్కొని 52 పాఠశాలలను ఏర్పాటు చేసారు ఫూలే దంపతులు.
మహారాష్ట్రలో ప్లేగు వ్యాధి విలయాన్ని సృష్టించింది. అలాంటి సమయంలో కూడా తన ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా రోగులకు సేవలు అందించింది సావిత్రిబాయి ఫూలే. అయితే దురదృష్టవశాత్తు అదే ప్లేగు వ్యాధికి గురై 1897 మార్చి 10 న మరణించింది సావిత్రిబాయి ఫూలే. ఈరోజు సావిత్రిబాయి ఫూలే వర్ధంతి దాంతో ఆ సందర్బంగా ఆ మానవతావాదికి నివాళి అర్పిస్తోంది jaiswarajya.tv .