
united opposition : దేశంలోని ప్రధాన విపక్ష పార్టీల అధినేతలంతా బిహార్ రాజధాని పాట్నాలో తిష్ఠ వేశారు. కేంద్రంలోని మోదీ సర్కారుపై సమర శంఖం మోగించేందుకు వీరంతా సిద్ధమవుతున్నారు. 15 కంటే ఎక్కువ పార్టీల అధినేతలు శుక్రవారం ఉదయాన్నే పాట్నాలోని సీఎం నితీశ్ కుమార్ అధికారిక నివాసానికి చేరుకున్నారు. 2024 ఎన్నికల్లో అనుసరిచాల్సిన వ్యూహాలపై చర్చించారు. శుక్రవారం సాయంత్రం వరకు ఈ చర్చలు కొనసాగాయి.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖార్గే, యువనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ దేశంలో మోదీ సర్కారు వల్ల ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని పేర్కొన్నారు. భారత్ జోడో అని కాంగ్రెస్ అంటుంటే, భారత్ టోడో అని ఆర్ఎస్ఎస్, బీజేపీ అంటున్నాయని ఎద్దేవా చేశారు. కర్ణాటక ఫలితాలతో మరోసారి ప్రజల చూపు కాంగ్రెస్ వైపు మళ్లిందని పేర్కొన్నారు. త్వరలోనే తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. దేశాన్ని విచ్చిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి గుణపాఠం చెప్పేందుకు ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని ఈ భేటీలో చర్చ జరిగింది.
అయితే ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖార్గేతో పాటు బిహార్ ముఖ్యమంత్రి. నితీశ్ కుమార్, టీఎంసీ అధినేత మమతాబెనర్జీ, డీఎంకే అధినేత స్టాలిన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే, ఆప్ అధినేత కేజ్రివాల్, జార్కండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి బీజేపీ పై పోరాటానికి కలిసిరాని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, బీఎస్పీ అధినేత్రి మాయావతికి ఆహ్వానం పంపలేదని విపక్షాల నేత ఒకరు మీడియాకు వెల్లడించారు.
అయితే మరో ఏడాదిలో లోక్సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో విపక్షాల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. మోదీని ఢీకొట్టేందుకు ప్రధాన పార్టీలన్నీ సమరశంఖం పూరించేందుకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి. మరోవైపు వీరి భేటీని బీజేపీ నేతలు హేళన చేస్తున్నారు. అది కేవలం ఫొటోసెషన్ మాత్రమేనని బీజేపీ అగ్రనేత అమిత్ షా అన్నారు. మరోవైపు మాయవతి స్పందిస్తూ బయట కత్తులు నూరుకుంటూ లోపల భేటీ పేరిట నాటకాలాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, రవిశంకర్ ప్రసాద్ కూడా ఈ బేజీపై వ్యంగ్యంగా కామెంట్లు చేశాడు.
అయితే విపక్షాల భేటీ సాయంత్రం ముగిసింది. బీజేపీ పై ఐక్య పోరుకు సిద్ధం కావాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. సిమ్లాలో మరోసారి సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బీజేపీపై పోరులో కలిసి వచ్చే వారిని కలుపుకుంటూ పోతామని చెప్పారు.