
ఎన్నికల్లో గెలిచేందుకు నేతలు.. మాట్లాడే మాటలు వారికి పదవీ గండాన్ని తీసుకొస్తున్నాయి. పదవి వ్యామోహంతో చేసే వ్యాఖ్యలు పదవి పోయేలా చేస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. 2019లో గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ దొంగలందరికీ మోదీ అనే ఇంటి పేరు ఎందుకుంటుందో అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకు పదవీ గండాన్ని తెచ్చిపెట్టాయి. గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ చేసిన ఫిర్యాదుతో సూరత్ కోర్టు దోషిగా పరిగణించి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, సెక్షన్ 8(3) ప్రకారం ఏదైనా కేసులో దోషిగా తేలి, రెండేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష పడిన చట్టసభ సభ్యులు (MP/MLAs) తమ సభ్యత్వాన్ని కోల్పోతారు. ఇప్పుడు సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది.
గతంలోనూ చాలా మంది ప్రజాప్రతినిధులు తమ పదవులను కోల్పోయారు. తమిళనాడు మాజీ సీఎం జయలలిత సైతం జైలు శిక్ష కారణంగా అనర్హతకు గురయ్యారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడడంతో ఆమె అనర్హతకు గురయ్యారు. అయితే 2015లో కర్ణాటక హైకోర్టు కింది కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టి నిర్దోషిగా ప్రకటించడంతో ఆమె తిరిగి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. లక్షద్వీప్ ఎంపీ మొహమ్మద్ ఫైజల్‌ను అక్కడి సెషన్స్ కోర్టు హత్యాయత్నం కేసులో దోషిగా తేల్చేంది. దీంతో ఈ ఏడాది జనవరిలో ఆయన ఎంపీ పదవిని కోల్పోయారు. కేరళ హైకోర్టు స్టే విధించడంతో తిరిగి ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధించాలని న్యాయశాఖ సిఫార్సు చేసింది. ఇక దాణా కుంభకోణంలో దోషిగా తేలిన లాలూ ప్రసాద్ యాదవ్ తన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. 2013లో వచ్చిన తీర్పుతో పదవిని కోల్పోయారు. సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజాంఖాన్ 2019లో చేసిన ద్వేషపూరిత ప్రసంగం కేసులో కోర్టు దోషిగా తేల్చింది. దీంతో యూపీ అసెంబ్లీ ఆయన్ను అనర్హుడిగా ప్రకటించింది.
ఇక దాణా కుంభకోణంలోనే జేడీయూ నేత బీహార్‌లోని జహానాబాద్ ఎంపీ జగదీష్ శర్మపై అనర్హత వేటు పడింది. కాంగ్రెస్ రాజ్య సభ సభ్యుడు రషీద్ మసూద్‌కు ఎంబీబీఎస్ సీట్ల కుంభకోణంలో నాలుగేళ్ల శిక్ష పడింది. దీంతో ఆయన రాజ్యసభ పదవి పోయింది. సూసైడ్ కేసులో మధ్యప్రదేశ్ బిజావర్ ఎమ్మెల్యే ఆశారాణి అనర్హతకు గురయ్యారు. ఇక 2014లో శివసేన ఎమ్మెల్యే బాబన్‌రావ్ ఘోలాప్‌నకు అక్రమాస్తుల కేసులో మూడేళ్ల జైలు శిక్ష పడడంతో ఆయన సభ్యత్వం కోల్పోయారు. మహారాష్ట్రకు చెందిన మరో ఎమ్మెల్యే సురేష్ హల్వాంకర్ విద్యుత్ దోపిడీ కేసులో దోషిగా తేలడంతో 2014లో పదవిని కోల్పోయారు. 2015లో జార్ఖండ్‌లోని లోహర్‌దగ్గా ఎమ్మెల్యే కమల్ కిశోర్ భగత్ ఓ హత్య కేసులో దోషిగా తేలడంతో 2015లో అనర్హతకు గురయ్యారు.
ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం దోషిగా తేలిన వ్యక్తి రెండేళ్ల లేదా అంతకంటే ఎక్కవ కాలం శిక్ష పడితే వారు తీర్పు వెలువడిన వెంటనే రాజ్యంగ పదవుల్లో ఉండేందుకు అనర్హులవుతారు. అంతేకాక.. జైలు శిక్ష కాలంతో పాటు.. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కోల్పోతారు. 2013లో ప్రజాప్రతినిధులు దోషిగా తేలితే వారిని వెంటనే అనర్హులుగా ప్రకటించాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పును అనుసరించి ఇప్పుడు రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటించారు. అయితే సూరత్ కోర్టు రాహుల్‌కు బెయిల్ మంజూరు చేయడమే కాక.. అప్పీల్ చేసుకునేందుకు 30 రోజుల గడువునిచ్చింది. అయితే రాహుల్ అప్పీల్ చేసుకుంటే కోర్టు నిర్ణయాన్ని బట్టి ఆయన మళ్లీ పదవికి అర్హత పొందే అవకాశముంది