
Global warming : ఏప్రిల్ చివరి వారాల్లో భారత్, థాయిలాండ్, బంగ్లాదేశ్, లావోస్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భారత్ లో ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో ఏప్రిల్ 18న అత్యధికంగా 44 డిగ్రీలు, థాయిలాండ్‌లోని టాక్ నగరంలో 45.4 డిగ్రీలు, బంగ్లాదేశ్‌లోని ఢాకాలో దశాబ్దంలోనే అత్యధికంగా ఏప్రిల్ 15న 40.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. లావోస్‌లోని సైన్యబులి ప్రావిన్స్‌లో ఏప్రిల్ 19న నమోదైన 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత ఆల్‌టైమ్ రికార్డు అంటూ వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ఇలా తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడం.. అదీ పొడి వాతావరణం, ఉక్కపోతలతో కూడి ఉండడంతో వడదెబ్బ కేసులు భారీగా పెరుగుతున్నాయి. వడదెబ్బకు ఏప్రిల్ 16న ఒక్క రోజే ముంబయిలో 13 మంది మృతి చెందగా, 60 మందికి హాస్పిటల్స్ లో వైద్యం అందజేస్తున్నారని అధికారికంగా తెలిసింది. ఇక అనధికారిక సమాచారం ప్రకారం 650 మంది ఆసుపత్రుల్లో చేరగా.. మృతుల సంఖ్య కూడా ఎక్కువే అని తెలుస్తోంది. థాయిలాండ్‌లోనూ మరణాలు సంభవించాయి. వడగాలులు, ఎండ బారిన పడి ఎంతమంది చనిపోయారనేది కొన్ని నెలల తర్వాత గాని కచ్చితంగా చెప్పలేమని చెప్తున్నాయి ప్రభుత్వాలు.
మానవ తప్పిదాలతో వాతావరణంలో భారీ మార్పులు ఏర్పడి భారత్, బంగ్లాదేశ్, లావోస్, థాయిలాండ్
లో తేమతో కూడిన వడగాలుల (హ్యుమిడ్ హీట్‌వేవ్) ప్రభావం సాధారణం కంటే 30 రెట్లు ఎక్కువగా ఉందని అంతర్జాతీయ పర్యవరణ శాస్త్రవేత్తల బృందం తెలిపింది. యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే), భారత్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, థాయిలాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా, కెన్యా, అమెరికా తదితర దేశాలకు చెందిన 22 మంది శాస్త్రవేత్తలు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు.
ఇందులో భారత్ నుంచి తిరుపతి ఐఐటీకి చెందిన చంద్రశేఖర్ బహినిపాటి, ఢిల్లీ ఐఐటీకి చెందిన ఎస్‌టీ చైత్ర, ఉపాసనా శర్మ, అన్సు ఓగ్రా, ముంబై ఐఐటీకి చెందిన అర్పితా మొండల్, ఐఎండీకి చెందిన అరులాలన్ ఉన్నారు. వీరు బుధవారం (మే 17)న నివేదిక విడుదల చేశారు. ప్రస్తుతం అధ్యయనం చేసిన ప్రాంతం ప్రపంచంలోనే అత్యధిక వడగాలలు వీచే ప్రాంతమని వారు చెప్పారు. వాతావరణంలో వచ్చిన కీలకమార్పుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వడగాలులు ఎక్కువ రోజులు ఉండడంతో పాటు అత్యధిక వేడిని మోసుకువస్తాయని తెలిపింది.
రెండేళ్లకోసారి..
భారత్, బంగ్లాదేశ్‌లో వడగాలులు గతంలో శతాబ్ధంలో ఒకసారి కంటే తక్కువగానే వచ్చేవి. ఇది ఇప్పుడు ఐదేళ్లకోసారి వస్తుంది. ఇప్పుడున్న వాతావరణంలో ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు పెరిగితే ప్రతి రెండేళ్లకోసారి చవిచూడాల్సి ఉంటుందని నివేదిక వెల్లడించింది. లావోస్, థాయిలాండ్‌లో ఇటీవల రికార్డు స్థాయిలో సంభవించిన ఉక్కపోతతో కూడిన వడగాలులు. వాతావరణ మార్పువల్లే వస్తున్నాయని నివేదిక తెలిపింది. ఇప్పటికీ సాధారణంగానే ఉన్నాయని మరింత కాలుష్యం పెరిగితే పెను ప్రమాదం తెచ్చిపెడతాయని హెచ్చరిస్తుంది నివేదిక.
వడ గాలులతో ప్రతి ఏటా వేలం మంది మరణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. చాలా దేశాల్లో మరణాలను తక్కువగా చూపుతున్నారని వెల్లడించింది. దేశంలో పెరిగిన ఉష్ణోగ్రతలు, వడగాలుల వల్ల పాఠశాలలను మూసివేయాల్సి వచ్చిందని. పశ్చిమబెంగాల్, ఒడిశా, త్రిపురలో 3వారాల ముందుగానే పాఠశాలు మూసేశారని, ఇదే సమయంలో అడవుల్లో అగ్ని ప్రమాదాలు చాలా ఎక్కువగా జరిగాయని వివరించింది.