Shravana Masam : హిందువులు శ్రావణ మాసానికి అత్యంత ప్రాధాన్యమిస్తుంటారు. ఈ పవిత్ర మాసంలో పూజలు, యాగాలు, హోమాలు చేస్తే జన్మజన్మల పుణ్య ఫలం లబిస్తుందని నమ్మకం. శ్రావణ మాసంలో ముఖ్యంగా మహిళలు ఎన్నో నోములు నోచుకుంటుంటారు. నోములు, పేరంటాలకు శ్రావణ మాసం ఎంతో ప్రసిద్ధి చెందింది. విశేషమైన పూజలు, పునస్కారాలు ఈ మాసంలోనే నిర్వహిస్తుంటారు. అందుకే పెళ్లిళ్లు, శుభకార్యాలు, ప్రారంభోత్సవాలు అన్నీ ఈ మాసంలో జరపడానికే ప్రాధాన్యమిస్తుంటారు. ఈ శ్రావణమాసంలో శుభ ముహూర్తాలు ఎప్పుడెప్పుడున్నాయనేది తెలుసుకుంందాం.
2024లో శుభ ముహూర్తాలేవని పండితులు చెబుతున్నారు. మూడాలు ఉండడంతో మార్చి వరకే శుభ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 11న మాఘమాసం ప్రారంభమైంది. ఇక్కడి నుంచి ఏప్రిల్ 26వ వరకు పెళ్లిళ్లు జరిగాయి. అయితే ఆ తర్వాత మూఢం, శూన్యమాసం రావడంతో వివాహాది కార్యక్రమాలు,ఇతర శుభ ముహూర్తాలు వాయిదా పడ్డాయి. మళ్లీ శ్రావణ మాసంలోనే వివాహాలు, ఇతర కార్యక్రమాలు శుభ ముహుర్తాలు ఉన్నాయని వేద పండితులు అంటున్నారు.
ఆగస్టు 5 న శ్రావణమాసం ప్రారంభమవుతుంది. సోమవారం నుంచి తిరిగి శుభకార్యక్రమాలు జరగనున్నాయి. ఆగస్టు 8, 9,10,11,15, 17,18,22,23,24,28, 30 తేదీల్లో శుభముహూర్తాలు ఉన్నాయని వేద పండితులు చెబుతున్నారు. ఈ తేదీల్లో శంకుస్థాపనలు, గృహ ప్రవేశాలకు , వివాహాలకు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. ఈసారి దేశవ్యాప్తంగా లక్షలాది వివాహాలు, ఇతర కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక వివాహాలకు సంబంధించి ఒక్కో ముహుర్తానికి వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉందని వేద పండితులు చెబుతున్నారు. శుభ ముహుర్తాలు ప్రారంభం కావడంతో మార్కెట్లో వ్యాపారాలు కూడా మరింత జోరందుకునే అవకాశాలు ఉన్నాయి.