Night sleep : ప్రతి ఒక్కరూ రోజుకు ఎనిమిది గంటలు నిద్ర పోవాలని వైద్యులు సూచిస్తుంటారు. మారుతున్న కాలం కారణంగా అందరికీ నాణ్యమైన నిద్ర లభించడం లేదు. ఇక పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు, ఉద్యోగార్థుల్లో ఒత్తిడి అనేది సర్వ సాధారణం. రోజులో ఎక్కువ గంటలు కష్టపడి చదువుతూ ఉంటారు. దీంతో వారి నిద్రలో నాణ్యత లోపిస్తుంది. రాత్రిళ్లలో లైట్లు, గ్యాడ్జెట్లను స్విచాఫ్ చేసి నిద్ర పోయేందుకు ప్రయత్నించినా కొన్నిసార్లు మెదడులో ఏవేవో ఆలోచనలు అలా తిరుగుతూనే ఉంటాయి. ఈ సమస్యని అధిగమించేందుకు బటర్‌ఫ్లై ట్యాపింగ్ టెక్నిక్ అనుసరిస్తే చాలా మేలు జరుగుతుందంటున్నారు సోమాటిక్ యాంగ్జాయిటీ నిపుణులు జోలీ స్లోవిస్. ఇంతకీ ఏమిటీ టెక్నిక్? ఎలా పనిచేస్తుందో చూద్దాం.
మన పెద్దలు ఆలోచనల్లేకుండా జీవితమే ఉండదు అంటారు. అలాగని, రాత్రి నిద్రపోయాక కూడా మెదడును ఆలోచనలు తొలి చేస్తుంటే.. చాలా ఇబ్బందిగా ఉంటుంది . ప్రతి మనిషికీ నిద్ర చాలా ముఖ్యం. ఈ కాలంలో జీవనశైలిలో మార్పులు, పని ఒత్తిడి వంటి సమస్యలు మనిషిని నిద్రకు దూరం చేస్తున్నాయి. నిద్ర కరవైతే మనిషికి నీరసం, నిస్సత్తువ ఆవహిస్తాయి. ఏకాగ్రత లోపించి చురుకుదనాన్ని కోల్పోతారు. నిద్రలో మీ మెదడు పుట్టెడు ఆలోచనలతో నిండిపోయి ఆందోళనకు గురిచేస్తే.. బటర్‌ఫ్లై ట్యాపింగ్ టెక్నిక్‌ను ప్రయత్నించాలంటున్నారు నిపుణులు. ఇందుకోసం మీ రెండు అర చేతుల్ని ఛాతిపై ఉంచి బొటనవేళ్లను ఓ కొక్కెం మాదిరిగా జోడించాలి. సీతాకోక చిలుక (బటర్‌ఫ్లై) ఆకారంలో చేతుల్ని ఉంచి ఛాతీపై ఎడమ, కుడి అరచేతులతో ప్రత్యామ్నాయంగా అలా చరుస్తుండాలి. ఇలా ఒకట్రెండు నిమిషాల పాటు ఈ ప్రక్రియను చేయడం ద్వారా శరీరం రిలాక్సేషన్ మోడ్‌లోకి వెళ్లి.. మెదడులో ఆలోచనలు తగ్గి త్వరగా నిద్రలోకి జారుకునే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు.
రాత్రిపూట మంచి నిద్ర కోసం బటర్‌ఫ్లై ట్యాపింగ్ టెక్నిక్ వినియోగంలో ఉందని.. కానీ ఇది అందరికీ పనిచేయకపోవచ్చని మరికొందరు చెబుతున్నారు. ఒత్తిడికి గురైతే నిద్ర పట్టడం చాలా కష్టమే.. నిద్రకు సరైన షెడ్యూల్ లేకపోవడం, నాణ్యమైన నిద్ర కరవవడంతో కొన్ని సందర్భాల్లో ఇది నిద్రలేమి కి దారి తీస్తుంది. అందువల్ల ఈ టెక్నిక్‌లో రిథమిటిక్ వైబ్రేషన్లతో శరీరం రిలాక్స్ మోడ్‌లోకి వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. మనుషులు రోజులో కనీసం 7 నుంచి 8గంటల నాణ్యమైన నిద్ర ఉండేలా ప్లాన్ చేసుకోవాలని, ఇందుకోసం అవసరమైతే తమ జీవన శైలిలో కొన్ని సర్దుబాట్లు చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ఈ టెక్నిక్‌ను ట్రై చేయడం వల్ల ఎలాంటి హానికరం కాదని.. కాకపోతే మీలో ఒత్తిడికి గల కారణాలను తెలుసుకొని పరిష్కరించుకోవడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
View this post on InstagramA post shared by Jolie Slovis | Somatic Anxiety Coach | Meditation Mentor (@jolienan.coach)