Upasana : మూగ జీవాల సంరక్షణ కోసం పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ ఓ ఎన్జీవో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల తన కల నెరవేరిందంటూ రేణుదేశాయ్ శనివారం పోస్ట్ పెట్టారు. ‘శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్’ పేరిట ఏర్పాటైన ఈ స్వచ్ఛంద సంస్థకు ఎవరైనా విరాళాలు ఇవ్వొచ్చని రేణు దేశాయ్ పేర్కొన్నారు. అలాగే తానొక అంబులెన్స్ కొనుగోలు చేసినట్లు తెలిపారు. దీనిని కొనుగోలు చేసేందుకు గ్లోబర్ స్టార్ రామ్‌చరణ్ భార్య ఉపాసన సాయం అందించారు. చరణ్ పెంపుడు శునకం రైమీ పేరుతో ఈ విరాళాన్ని అందించారు. ఈ విషయాన్ని రేణూ దేశాయ్ స్వయంగా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో వెల్లడించారు. ‘‘అంబులెన్స్ కొనుగోలుకు విరాళం అందించిన రైమీకి ధన్యవాదాలు’’ అని రేణుదేశాయ్ కోట్ చేశారు. ఈ పోస్ట్ కు రేణూ ఉపాసనను ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఉపాసన ఔన్నత్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
రేణూదేశాయ్‌కు మూగజీవాలంటే ఎంతో ఇష్టం. వాటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలంటూ రేణూ తరచూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తుంటారు. ఈ క్రమంలోనే తన కుమార్తె ఆద్య పేరిట రేణు ఎన్జీవోను ప్రారంభించారు. ‘‘ఎన్నో ఏళ్ల నుంచి ఈ రోజు కోసం ఎదురుచూస్తున్నానని, చిన్నతనం నుంచి మూగ జీవాలను సంరక్షించడమంటే తనకు ఎంతో ఇష్టమని, చాలాసార్లు తన వంతుగా ప్రయత్నించానని, మూగ జీవాల కోసం నా గొంతు వినిపించాలని.. వాటి సంరక్షణకు ఇంకా ఏమైనా చేయాలని కొవిడ్ సమయంలో నిర్ణయించుకున్నానని, నా సొంత ఎన్జీవోను రిజిస్టర్ చేయించానని పేర్కొన్నారు రేణూ దేశాయ్. మరోవైపు, రామ్‌చరణ్-ఉపాసనలకు కూడా మూగ జీవాలంటే ఎంతో మక్కువ. రామ్ చరణ్ కు గుర్రాలన్నా, శునకాలన్నా ఎంతో ఇష్టమనే విషయం తెలిసిందే.