2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున బరిలో దిగుతున్నట్లు భారత సంతతి మహిళ నిక్కీ హేలీ ప్రకటించారు. ఈనెల 15 నుంచి సౌత్ కరోలినాలోని చార్లెస్టన్ నుంచి ప్రచారం ప్రారంభిస్తానని 51ఏళ్ల ఈ భారతీయ అమెరికన్ తెలిపారు. ఇక ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ నుంచి మరోసారి తాను బరిలోకి దిగుతున్నట్లు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరి మధ్య పోటీ జరగనుంది. తాజా పరిణామంతో తన మాజీ బాస్ ట్రంప్‌కు నిక్కీ ఏకైక ప్రత్యర్థిగా నిలవనున్నారు. ఇక అమెరికా అధ్యక్ష బరిలో నిలవబోతున్న మూడో భారతీయ అమెరికన్ నిక్కీ. ఇంతకుముందు 2015లో లూసియానా గవర్నర్‌గా పనిచేసిన బాబీ జిందాల్, 2020లో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడ్డారు. కానీ, చివరి నిమిషంలో కమలా తప్పుకున్నారు. దాంతో జో బైడెన్‌కు మార్గం సుగమమైంది.
ఇంతకుముందు ట్రంప్ మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తే తాను బరిలో దిగబోనని గతంలో ప్రకటించిన నిక్కీ ఇప్పుడు మనసు మార్చుకున్నారు. గత నెలలో తాను అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవనున్నట్లు హింట్ ఇచ్చిన ఆమె ఇప్పుడు దాన్ని నిజం చేశారు. అటు అగ్రరాజ్యం అధ్యక్ష పదవికి పోటీ చేసేటప్పుడు రెండు విషయాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని నిక్కీ చెప్పారు. మొదటిది ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త నాయకత్వం అవసరమా? రెండోది ఆ కొత్త లీడర్ తానేనా? అన్నది చూడాలన్నారు. ప్రస్తుతం అమెరికాకు కొత్త నాయకత్వం అవసరం అనేది తన అభిప్రాయమని చెప్పిన నిక్కీ.. ఆ కొత్త లీడర్ తానే కావొచ్చని అప్పుడు అన్నారు.
ఇక నిక్కీ హేలీ ఇంతకుముందు సౌత్ కరోలీనాకు రెండుసార్లు గవర్నర్‌గా పనిచేశారు. అలాగే డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెన్సీ ప్రారంభంలో రెండేళ్లపాటు హేలీ 2017 నుండి 2018 వరకు ఐక్యరాజ్యసమితిలో అమెరికన్ రాయబారిగా సేవలు అందించారు. సౌత్ కరోలినా గవర్నర్‌గా ఉన్న సమయంలో ఆమె బిజినెస్ ఫ్రెండ్లీ నేతగా పేరు పొందారు. రాష్ట్రానికి ప్రధాన కంపెనీలను ఆకర్షించడంపై దృష్టి సారించి నిక్కీ విజయవంతం అయ్యారు కూడా. అలాగే 2015లో చార్లెస్టన్ ఇమాన్యుయేల్ AME చర్చీలో జాతివివక్షతో జరిగిన సామూహిక కాల్పుల ఘటన సమయంలో ఆమె స్పందించిన తీరుకు దేశవ్యాప్తంగా మంచి పేరు పొందారు. కాగా, ఈమె పేరెంట్స్ అజిత్ సింగ్ రన్‌ధావా, రాజ్‌కౌర్ రన్‌ధావా. పంజాబ్ అగ్రికల్చర్ వర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసే అజిత్ సింగ్ ఫ్యామిలీతో కలిసి 1960లో మొదట కెనడాకు ఆ తర్వాత అక్కడి నుంచి అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.