అల్ ఖైదా చీఫ్ అల్ జవహరిని హతం చేసినట్లు ప్రకటించింది అగ్రరాజ్యం అమెరికా. ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ లో డ్రోన్ లతో దాడులు చేసింది అమెరికా. అల్ జవహరి తలదాచుకున్న స్థలం గుర్తించి డ్రోన్ ల సహాయంతో దాడులు నిర్వహించి అల్ ఖైదా చీఫ్ ని మట్టుబెట్టింది. అల్ జవహరి హతమయ్యాడు అని నిర్దారించుకున్న తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేసాడు.
అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకున్న వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదని , ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సరే పట్టుకొని శిక్షిస్తామని అందుకు ఈ సంఘటనే ఉదాహరణ అని హెచ్చరించారు బైడెన్. 9/11 ఉగ్ర దాడులతో అగ్రరాజ్యం అమెరికా వణికిపోయింది. బిన్ లాడెన్ , అల్ జవహరి నేతృత్వంలోనే అప్పట్లో ఉగ్రదాడులు జరగడంతో పాకిస్థాన్ లో దాక్కున్న బిన్ లాడెన్ ని అమెరికా దళాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుండే అల్ జవహరి కోసం అమెరికా దళాలు గాలిస్తున్నాయి. ఇన్నాళ్లకు ఆఫ్గనిస్తాన్ లో ఉన్న అల్ జవహరిని కూడా మట్టుబెట్టాయి అమెరికా దళాలు. దాంతో అమెరికా పౌరుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది.