భారత్ తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA ) కోసం యునైటెడ్ కింగ్ డమ్ తహతహలాడుతోంది. గతంలోనే పలు కీలక నిర్ణయాలు బ్రిటన్ తీసుకున్నప్పటికీ తాజాగా రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని కావడంతో మరింత వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకు కారణం ఏంటో తెలుసా…….. రిషి సునాక్ భారత సంతతికి చెందిన వ్యక్తి కావడమే. అంతేకాదు భారత్ నమ్మదగిన దేశం కావడం కూడా గమనార్హం.
ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక పరిపుష్టి సాధిస్తున్న దేశాల్లో భారత్ త్వరితగతిన దూసుకుపోతోంది. మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్ రూపుదిద్దుకోబోతోంది. దాంతో భారత్ తో మరింత స్నేహపూర్వకంగా ఉండాలని భావిస్తోంది బ్రిటన్. ఇటీవల ఇండోనేషియాలో జి20 దేశాల శిఖరాగ్ర సమావేశం జరిగిన విషయం తెలిసిందే.
కాగా ఆ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశమయ్యాడు రిషి సునాక్. తాజాగా బ్రిటన్ దిగువ పార్లమెంట్ లో భారత్ తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గురించి అధికార , ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు రిషి సునాక్. భారత్ తో మెరుగైన వాణిజ్య ఒప్పందం కోసం కృషి చేస్తున్నామని స్పష్టం చేశాడు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్.