
అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. ఇక ఎన్నికల ఫలితాలు మరింత రసవత్తరంగా వస్తుండటంతో ఇరు పక్షాలకు ఇవి నిరాశ కలిగించే ఫలితాలు అనే చెప్పాలి. ఎందుకంటే జో బైడెన్ ప్రభుత్వం పట్ల అమెరికన్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని దాంతో రిపబ్లికన్ పార్టీకి భారీ విజయాలు దక్కడం ఖాయమని భావించారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.
కానీ ఆయన అంచనాలను తలకిందులు చేస్తూ మిశ్రమ ఫలితాలు వచ్చాయి. అంతేకాదు ట్రంప్ బలపరిచిన పలువురు అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఇది సరిపోనట్లుగా తాను తీవ్రంగా వ్యతిరేకించే డిశాంటిస్ బ్రహ్మాండమైన మెజారిటీతో విజయం సాధించడంతో ట్రంప్ కు పుండు మీద కారం చల్లినట్లైంది. దాంతో 2024 ఎన్నికల్లో డిశాంటిస్ తనకు ఎక్కడ పోటీకి వస్తాడో అనే భయం పట్టుకుంది ట్రంప్ కు.
ఇక డెమో క్రాట్ ల విషయానికి వస్తే ……. తన రెండేళ్ల పాలన అమెరికా ప్రజలకు విశ్వాసం కలిగించిందని అందువల్ల మధ్యంతర ఎన్నికలలో పూర్తిగా అనుకూలమైన ఫలితాలు వస్తాయని భావించారు జో బైడెన్. కానీ అమెరికా ఓటర్లు బైడెన్ ను కూడా పూర్తిగా విశ్వాసం లోకి తీసుకోలేదు. దాంతో మిగతా రెండేళ్ల పాలనలో ఒళ్ళు దగ్గర పెట్టుకోమని సంకేతాలు ఇచ్చినట్లైంది.