న్యూజెర్సీ:
శతాబ్ది గాయకుడు, గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వర రావు జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ప్రవాసులు. న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ నగరంలోని స్థానికి రాయల్ ఆల్బర్ట్ పాలెస్‌లో ఆదివారం ఘంటసాల శతజయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అన్నా మధుసూదనరావు అధ్యక్షతన ఘంటసాల సంగీత కళాశాల ఇంటర్నేషనల్ (GSKI) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
వేదమంత్రాల ఉచ్ఛారణతో జ్యోతి వెలిగించి ప్రార్థనాగీతాలతో ప్రారంభమైన ఈ వేడుకలు ప్రవాసులను ఆద్యంతమూ అలరించాయి. ఘంటసాల సతీమణి సావిత్రి భారత్ నుంచి పంపిన వీడియో సందేశం మహాగాయకుడి పాటల ఙ్ఞాపకాలను అందరి మనసుల్లో నింపింది. ఘంటసాల కూతురు సుగుణ, ఆయన కోడలు కృష్ణకుమారి శతజయంతి వేడుకలు జయప్రదం కావాలని సందేశాలు పంపారు. ప్రపంచంలోనే అత్యధిక అసంఖ్యలో సంస్మరణ సభలు జరిగిన గాయకుడిగా ఘంటసాలకి మాత్రమే ఘనత దక్కిందని, ఆ వివరాలను ఉదాహరిస్తూ, శతాబ్ది గాయకుడికి అత్యున్నత పురష్కారం భారతరత్న ఇవ్వవలసిందిగా భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించారు ఘంటసాల కోడలు కృష్ణకుమారి. ఘంటసాలకి భారతరత్న పురస్కారం ప్రధానం చేయవలసిందిగా సభ్యుల సంతకాలు సేకరించి భారత ప్రభుత్వానికి వినతి పత్రం పంపించారు. ఈ ప్రయత్నంలో సన్నిధి సుబ్బారావు, రాజేంద్ర డిచ్చిపల్లి సహకారం అందించారు.
ఘంటసాల ఆలపించిన 101 భగవద్గీత శ్లోకాలను, 20 మంది GSKI సభ్యులు శ్రద్దతో గానం చేసి శతాబ్ది గాయకుడికి ఘన నివాళి అర్పించారు. ఈ పఠనం ప్రపంచంలోనే తొలిసారిగా జరిగినట్టు నిర్వహకులు తెలిపారు. శత జయంతి సందర్బంగా GSKI సభ్యులు ఘంటసాల సంగీత దర్శకత్వం, గానంతో సమకూర్చిన 100 పాటల పల్లవులను శత గీత విభావరిగా పాడి ప్రేక్షకులను మైమరిపించారు. ఘంటసాల సంగీత దర్శకత్వం వహించిన రహస్యం సినిమాలోని గిరిజా కల్యాణం కూచిపూడి యక్షగానాన్ని చిన్మయి నృత్యాలయ న్యూజెర్సీ వారు శ్రీదేవి ముంగర, చిన్మయి ముంగర ఆధ్వర్యంలో ప్రదర్శించి అందరినీ మంత్రముగ్దులను చేశారు. ఘంటసాల పాటలను ప్రముఖ సినీ గాయకుడు ఆదిత్య అయ్యంగార్ గానం చేసి శ్రోతలను ఆకట్టుకున్నారు.
ఈ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన మద్దుల సూర్యనారాయణ, గంటి భాస్కర్, ఇతర ప్రముఖులు GSKI చేస్తున్న సేవలను ప్రశంసించారు. ఘంటసాల శత జయంతి వేడుకలను వైభవంగా జరపడానికి తోద్పడిన ప్రతి ఒక్కరికి GSKI ప్రెసిడెంట్ అన్నా మధుసూదనరావు, ఇతర ట్రష్టీలు పుష్పకుమారి, రవితేజ కృతఙ్ఞతలు తెలిపారు. తెలుగు భాషకు వరం.. ఘంటసాల స్వరం.. అనే నినాదంతో ముందుకు సాగుతూ తెలుగు భాషను ముందు తరాలకు పదిలంగా వ్యాపింపచేయడమే తమ లక్ష్యమని GSKI సభ్యులు తెలిపారు. తెలుగు భాష ఆచంద్రతారార్కం ప్రకాశించేలా అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు చేసిన కృషిని కొనియాడారు. ముసుకు మహేంద్ర రెడ్డి, వెంపరాల సుజాత, తాడేపల్లి రేణు, టీపీ శ్రీనివాసరావు, కనకమేడల శివశంకరరావు, ఆళ్ళ రామిరెడ్డి, గూడూరు ప్రవీణ్, మాడిశెట్టి రంగారావు, సన్నిధి సుబ్బారావు, తడికమళ్ళ ప్రవీణ్, గూడూరు శ్రీనివాస్, చెరువు విద్యాసాగర్, గిడుగు సోమశేఖర్.. తదితరులు ఈ వేడుకలను విజయవంతంగా తీర్చిదిద్దారు.