అమెరికాలో భారతీయ కుటుంబం దారుణ హత్యకు గురయ్యింది. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ సంఘటన సోమవారం రోజున జరిగింది. భారతదేశంలోని పంజాబ్ కు చెందిన కుటుంబం అమెరికాలో స్థిరపడింది. జస్లీన్ కౌర్ (27) , జస్దీప్ సింగ్ ( 36) , అమన్ దీప్ సింగ్ (39) లతో పాటు ఎనిమిది నెలల చిన్నారి అరూహీ లను దారుణంగా చంపేశారు. సోమవారం రోజున కాలిఫోర్నియాలోని మెర్సిడ్ కౌంటీ నుండి అపహరణకు గురయ్యారు.
కొంతమంది దుండగులు తుపాకులతో బెదిరించి ఈ నలుగురిని కిడ్నాప్ చేసారు. జస్దీప్ సింగ్ కుటుంబం కిడ్నాప్ కు గురి కావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలోనే ఇండియానా రోడ్& హచిన్ సన్ రోడ్ లోని పండ్ల తోటలో జస్దీప్ సింగ్ కుటుంబం హత్యకు గురైన విషయాన్ని ఆ పండ్ల తోటలో పనిచేసే వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దాంతో పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఇక కిడ్నాప్ చేసిన మాన్యుయెల్ సల్లాడోను అరెస్ట్ చేసారు పోలీసులు. అతడు ఎందుకు భారతీయ కుటుంబాన్ని చంపాడు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.