
అమెరికాలోని ఎయిర్ పోర్ట్ లో తెలుగు వ్యక్తి కోళ్ల విశ్వచంద్ ( 47 ) మరణించాడు. దాంతో ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈ సంఘటన మార్చి 28 న జరిగింది. అయితే ఆలస్యంగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా రేపల్లె కు చెందిన కోళ్ల విశ్వచంద్ అమెరికాలోని తకెడా ఫార్మాస్యూటికల్స్ లోని గ్లోబల్ అంకాలజీ విభాగంలో డాటా అనలిస్ట్ గా పనిచేస్తున్నాడు.
అయితే మార్చి 28 న ఇండియా నుండి అమెరికాకు తన స్నేహితుడు వస్తుండటంతో బోస్టన్ సిటీ లోని లోగన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. టెర్మినల్ వద్ద ఎదురు చూస్తున్న సమయంలో డార్ట్ మౌత్ ట్రాన్స్ పోర్టేషన్ బస్సు విశ్వచంద్ ను బలంగా ఢీకొట్టి వెళ్ళింది. దాంతో విశ్వచంద్ రెండు వాహనాల మధ్య ఇరుక్కుపోయి మృత్యువాత పడ్డాడు. అతడ్ని వెంటనే కాపాడటానికి ఎయిర్ పోర్ట్ సిబ్బంది శతవిధాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. విశ్వచంద్ మరణంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరు అవుతోంది.






