
అమెరికాలోని ఎడిసన్ లో జనసేన 10 వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పవన్ కళ్యాణ్ 2014 లో జనసేన అనే రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు సృష్టించాలని భావించి జనసేన అనే రాజకీయ పార్టీని స్థాపించాడు.
2014 లో పార్టీని స్థాపించినప్పటికీ ఆ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. అయితే టీడీపీ – వైసీపీ మీద వ్యతిరేకతతో 2019 లో అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల్లో పలు చోట్ల అభ్యర్థులను నిలబెట్టాడు. అలాగే పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్లా పోటీ చేసాడు. అయితే లోక్ సభ ఎన్నికల్లో అలాగే శాసనసభ ఎన్నికల్లో గట్టి షాక్ ఇచ్చారు ఓటర్లు. కేవలం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే గెలిచాడు. ఇక గెలిచిన ఎమ్మెల్యే ప్రస్తుతం వైసీపీ పంచన చేరాడు.
తనని రెండు చోట్ల ఓడించినప్పటికి పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన బలోపేతం కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. నిత్యం ప్రజలతో మమేకం అవుతూనే ఉన్నాడు. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈసారి పవన్ కళ్యాణ్ కు అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా జనసేన ఆవిర్భావ సమావేశాలు పెద్ద ఎత్తున నిర్వహించారు అభిమానులు , కార్యకర్తలు. అందులో భాగంగానే అమెరికాలోని ఎడిసన్ లో జనసేన 10 వ ఆవిర్భావ వేడుకలు వైభవంగా జరిగాయి. జనసేన అధికారంలోకి వచ్చేలా , ఎక్కువ సీట్లు సాధించేలా కష్టపడాలని తీర్మానించారు ఎన్నారైలు.
ఫోటోలు : డాక్టర్ శివకుమార్ ఆనంద్.