
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ( NATS ) 2500 పౌండ్ల ఆహారాన్ని విరాళంగా సేకరించి ఇచ్చింది. అమెరికాలో ఉంటున్న తెలుగువాళ్లు ఏర్పాటు చేసుకున్న స్వచ్ఛంద సేవా సంస్థ ” ఉత్తర అమెరికా తెలుగు సంఘం ”. ఈ సంఘం ఏడాది పొడవునా పలు సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతూనే ఉంది. తాజాగా నిరుపేద పిల్లల ఆహారం కోసం నడుం బిగించింది. దాదాపు 20 కుటుంబాలకు చెందిన తెలుగువాళ్ళు పిల్లలు , మహిళలు , యువతీయువకులు అందరూ కలిసి పిల్లల ఆహారం కోసం శ్రమించారు.
తాజా కూరగాయలు , పండ్లు , పాలు , వెన్న , అలాగే పాల ఉత్పత్తులు విరాళంగా ఇచ్చారు. మొత్తంగా 2500 పౌండ్ల ఆహారాన్ని విరాళంగా ఇచ్చారు. టంపా లోని పేద పిల్లల ఆకలి తీర్చే హాప్ చిల్డ్రన్స్ హోమ్ కు ఈ ఆహారాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ ఆహారం 70 మంది పిల్లలకు సరిపోతుందని నిర్వాహకులు తెలిపారు. థాంక్స్ గివింగ్ లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు ఉత్తర అమెరికా తెలుగు సంఘం. ఈ కార్యక్రమంలో శేఖర్ కోన , శివ , రాహుల్ , భాస్కర్ , అనిల్ , విజయ్ , రమేష్ , ప్రసన్న , రవి , తదితరులు కీలక పాత్ర పోషించారు.