భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఆంగ్లేయులు భారతదేశాన్ని దాదాపు 200 సంవత్సరాల పాటు పరిపాలించి 75 సంవత్సరాల క్రితం మన దేశం నుండి వెళ్లిపోయారు. భారత దేశం స్వాతంత్ర్యం సాధించి 75 సంవత్సరాల ఘన చరిత్రను దిగ్విజయంగా ఉత్సవాలను జరుపుకుంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఎన్నికవ్వడం భారతీయులకు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది.
మరో సంతోషకరమైన విషయం ఏమిటంటే……. రిషి సునాక్ పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడినప్పటికి హిందూ ధర్మాన్ని మాత్రం వీడలేదు. సనాతన భారతీయ సంస్కృతి ని అణువణువునా పుణికి పుచ్చుకున్నారు రిషి సునాక్. అందుకే గతంలో ప్రచారం సమయంలో సైతం హిందూ దేవాలయాలను సందర్శించడమే కాకుండా పలు గోశాలలను కూడా సందర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా హిందూ సంస్కృతికి ఎనలేని గౌరవం ఉంది. అయితే పాశ్చాత్య సంస్కృతి వెర్రితలలు వేస్తున్న ఈ రోజుల్లో కూడా తన మూలాలను మర్చిపోలేని వ్యక్తి , సమ్మోహన శక్తి రిషి సునాక్. బ్రిటన్ లో మన హిందూ ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఇది భారతీయులకు గర్వకారణమనే చెప్పాలి.