అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. అమెరికాలో కాల్పులు నిత్యకృత్యంలా మారాయి. తెలుగు సీరియల్ లా అమెరికాలో ఎక్కడో ఒక చోట కొనసాగుతూనే ఉన్నాయి కాల్పులు. తాజాగా అమెరికా ఇండిపెండెన్స్ డే సందర్బంగా క్రియో అనే దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ సంఘటనలో ఆరుగురు చనిపోగా దాదాపు 30 మంది గాయపడ్డారు. గాయపడిన వాళ్లలో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అమెరికాలోని షికాగో నగర శివారులోని ఐలాండ్ పార్క్ వద్ద ఇండిపెండెన్స్ డే వేడుకలు జరుగుతున్నాయి. కాగా ఆ వేడుకలలో పాల్గొనడానికి పెద్ద ఎత్తున అమెరికన్లు చేరుకున్నారు. ఇదే అదునుగా భావించిన 22 ఏళ్ల రాబర్ట్ క్రియో అధునాతనమైన రైఫిల్ తో కాల్పులకు తెగబడ్డాడు. దాంతో ప్రజలంతా హాహాకారాలు చేస్తూ తప్పించుకోవడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే ఆరుగురు చనిపోగా దాదాపు 30 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వాళ్ళని ఆసుపత్రికి తరలించిన పోలీసులు కాల్పులకు తెగబడిన క్రియో ని బంధించారు.