అగ్రరాజ్యం అమెరికాలో వ్యవసాయం చేస్తోంది తెలంగాణ మహిళ. వ్యవసాయం దండగ అనే ఈరోజుల్లో దండగ కాదు పండగ అని నిరూపిస్తోంది……. అది కూడా ఇక్కడ భారత్ లో కాదు అమెరికాలో. తెలంగాణ రాష్ట్రంలోని భవనగిరి దగ్గర గల మోత్కురు సమీపంలోని ఆరెగూడెంకు చెందిన మహిళ విశాలి.
అమెరికాకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా వెళ్ళింది. అక్కడ భర్తతో కలిసి సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తోంది. అయితే తన తండ్రికి ఎన్ని కష్టాలు వచ్చినా , నష్టాలు వచ్చిన వ్యవసాయం చేయడం మాత్రం ఆపలేదు. తన కళ్ళ ముందు తండ్రి కష్టం కనబడుతూనే ఉంది. అయినప్పటికీ తండ్రి పట్టుదల గుర్తుకు వచ్చి అమెరికాలో వ్యవసాయం చేయాలనే ఆలోచన చేసింది. ఇందుకు మొదట భర్త శ్రీధర్ రెడ్డి నుండి సహకారం లభించలేదట. ఎందుకంటే వ్యవసాయం చేయడం వల్ల నష్టాలు , కష్టాలు కాబట్టి.
కానీ తన శ్రీమతి పట్టుదల చూసి కాదనలేకపోయాడు. దాంతో వర్జీనియా లో ఒక ఎకరం లీజుకు తీసుకొని కొన్ని కూరగాయలు వేసింది. అవి మంచి పంటగా మారడంతో చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కొనుక్కొని పోతున్నారట. ఉదయం 5 గంటలకు పొలం దగ్గరకు పోవడం ఎనిమిదిన్నరకు ఇంటికి వచ్చి రెడీ అయి ఆఫీస్ పనులను చూడటం , సాయంత్రం 5 గంటల వరకు ఆఫీస్ పనులు ముగించుకొని మళ్ళీ పొలం పనులు చేస్తోంది విశాలి.
ఇక ఇప్పుడు విశాలి చేస్తున్న వ్యవసాయానికి ఆమె కుటుంబం మొత్తం అండగా నిలిచింది దాంతో ఇక ఎకరం వ్యవసాయం మాత్రమే కాదు 5 ఎకరాలు చేయాలని ప్లాన్ చేస్తోంది. దాంతో ఆమె కృషికి పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.