
తెలుగు వాళ్లకు అత్యంత ఇష్టమైన పండుగ సంక్రాంతి. ఇక పండగలలో అతిపెద్ద పండగ కూడా సంక్రాంతి కావడం విశేషం. సంక్రాంతి సంబరాలను అట్టహాసంగా మూడు రోజుల పాటు జరుపుకుంటారు. అయితే పెద్ద పండగ కావడంతో పండగ ముందు తర్వాత కూడా సందడి నెలకొంటుంది. దాంతో కనీసం వారం రోజుల పాటు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటారు….. ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు , పెద్దలు , మహిళలు , పురుషులు అనే తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ వేడుకలలో పాల్గొంటారు.
అయితే తెలుగు రాష్ట్రాలలో ఈ పండుగలను అట్టహాసంగా జరుపుకోవడం సర్వసాధారణం. కానీ అమెరికా లాంటి అగ్రరాజ్యానికి వెళ్లిన మన తెలుగువాళ్లు అక్కడ కూడా ఇంతే అట్టహాసంగా సంక్రాంతి సంబరాలు చేసుకోవడం విశేషం. ” తెలుగు కళా సమితి ” ఆధ్వర్యంలో న్యూజెర్సీ ఎడిసన్ లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి.
ఈ వేడుకలలో పిల్లలు , పెద్దలు , మహిళలు , పురుషులు ముఖ్యంగా యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరో విశేషం ఏంటంటే ….. తెలుగింటి సంప్రదాయమైన ఈ పండగను యువతీయువకులు నిర్వహించడం గొప్ప విశేషం. తెలుగింటి సంప్రదాయాలను గ్రామీణ వాతావరణం నుండి పట్టణాలకు , నగరాలకు వలస వచ్చిన వాళ్లే మర్చిపోతున్న ఈరోజుల్లో ఖండాంతరాలను దాటినవాళ్లు మన సంస్కృతి , సంప్రదాయాలను మర్చిపోకుండా భావితరాలకు అందించాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి అమెరికా లోని పలు స్వచ్ఛంద , సేవా సంస్థలు.
అందులో అగ్రభాగాన నిలిచింది ” తెలుగు కళా సమితి ”. తెలుగువాళ్ళ సంప్రదాయాలను కొత్తతరం మర్చిపోకుండా సంక్రాంతి సంబరాలలో పలు కార్యక్రమాలు చేపట్టారు. పిల్లలకు భోగి పళ్ళు పోయడం , మహిళలకు , అలాగే టీనేజ్ గర్ల్స్ కు ముగ్గుల పోటీలను నిర్వహించడం , స్టాల్స్ ఏర్పాటు చేసి చీరలు , నగల ప్రదర్శన చేయడం ……. సంక్రాంతి గొప్పతనం చాటిచెప్పేలా గంగిరెద్దులను ఏర్పాటు చేసి ఆ పండగ వాతారవరణాన్ని సృష్టించడం ….. పాటల పోటీలు అలాగే డ్యాన్స్ పోటీలు ఏర్పాటు చేసి మొత్తానికి అమెరికాలో ఉన్నప్పటికీ స్వగ్రామాల్లోనే ఉన్నామనే భావన కలిగించారు. ఈ కార్యక్రమానికి 600 మందికి పైగా తెలుగువాళ్లు హాజరయ్యారు.
ఫోటోలు : డాక్టర్ శివకుమార్ ఆనంద్.