ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లిన ముగ్గురు యువతీయువకులు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆ కుటుంబాల్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు యువతీయువకులు మరణించడంతో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంకకు చెందిన సాయి నరసింహా (25) , తెలంగాణ లోని నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం గోదారి గూడెం కు చెందిన ప్రేమ్ కుమార్ రెడ్డి (26) వరంగల్ నగరంలోని గిర్మాజీపేట కు చెందిన గుళ్లపల్లి పావని ( 22) తదితరులు విహారాయత్ర కోసం కారులో మంగళవారం ప్రయాణించారు.
అయితే ప్రయాణిస్తున్న సమయంలో దట్టమైన పొగలు రోడ్డును కమ్ముకోవడంతో ఓ భారీ ట్రక్కును వేగంగా ఢీకొట్టింది. దాంతో పావని , ప్రేమ్ కుమార్ , సాయి నరసింహా మృతి చెందారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన వాళ్ళు మృత్యువాత పడటంతో ఆ కుటుంబాల్లో తీరని విషాదం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తో పాటుగా తెలంగాణ ప్రభుత్వం తీవ్ర విచారం వెలిబుచ్చింది. అమెరికా నుండి ఆ ముగ్గురు యువతీయువకుల మృతదేహాలను స్వస్థలాలకు తీసుకు రావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.