ప్రస్తుతం రాజకీయాలను సోషల్ మీడియానే నడుపుతున్నదని ఏపీలో సీనియర్ నేత హరిరామ జోగయ్య అన్నారు. ఫేక్ వార్తలను ప్రజలపై రుద్ది రాజకీయాలను శాసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను మాట్లాడని విషయాలను కూడా మాట్లాడినట్లు సోషల్ మీడియా లో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తాను రాసినట్లుగా సంతకం లేని లెటర్ ను సర్క్యూట్ చేస్తున్నారని మండిపడ్డారు. దీనిని నేను తీవ్రంగా ఖండించినట్లుగా చెప్పారు.
విలువల్లేని ‘సాక్షి’
సోషల్ మీడియాలో ప్రచారంలో వచ్చిన ఎలాంటి ఆధారం లేని వార్తను సాక్షిలో ప్రచురించడాన్ని చింతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది చిన్న విషయం కాదని, ఇక విలువలు పోగొట్టుకొని సాక్షి దిగజారడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కాపుల మనోభావాల్ని దెబ్బకొట్టేలా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేసినట్లు తాను అనని మాటలు ప్రచారంలోకి తెచ్చారని మండిపడ్డారు. బీజేపీకి ఆర్ఎస్ఎస్ లాగే మా కాపు సంక్షేమ సంఘం జనసేన, పవన్ కల్యాణ్ కు విధేయులుగా ఉంటామని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ మీద తాను విమర్శలు చేసే ప్రసక్తే లేదని తెలిపారు. తప్పుడు వార్తను ప్రచురించడం హేయమన్నారు. మంగళగిరి లో పవన్ కల్యాణ్ ప్రసంగంతో జనసైనికులకు ఎంతో ఉత్సాహం కలిగిందన్నారు. జనసేన ఏనాడు తెలుగు దేశాని కి సీఎం పదవి కట్టబెట్టేందుకు ఏర్పడలేదని, ఎన్నికలయ్యాకే దానిపై నిర్ణయిస్తామని చెప్పారన్నారు. టీడీపీ, జనసేన మాత్రం కలిసి ముందుకెళ్తామని మాత్రం చెప్పినట్లు తెలిపారు. ఈ ప్రకటనతో జనసైనికులంతా ఉత్సాహంతో పనిచేస్తారని, ఇది తనకెంతో సంతోషాన్నిచ్చిందని చెప్పారు. ఇకపై ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచురించవద్దని హితవు పలికారు.