టీడీపీ కార్యకర్తల మృతికి సంతాపం తెలిపిన బాలయ్య నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది టీడీపీ కార్యకర్తలు మరణించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై తీవ్ర విచారం వెలిబుచ్చారు హీరో , హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. తెలుగుదేశం పార్టీ జెండాలు మోసిన కార్యకర్తల పాడె మోయాల్సి రావడం బాధాకరమైన విషయం. ఎనిమిది మంది మరణించడంతో 80 లక్షల కార్యకర్తల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొందని , చనిపోయిన వారి కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు బాలయ్య.
తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో పాఠశాల , కళాశాల నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అనాథ పిల్లలకు అలాగే తెలుగుదేశం పార్టీని నమ్ముకొని చనిపోయిన వాళ్ళ పిల్లలకు ఈ పాఠశాలలో అలాగే కళాశాలలో ఉచితంగా చదువులు చెప్పిస్తున్నారు. ఇది గత 18 సంవత్సరాలుగా కొనసాగుతోంది. దాంతో కందుకూరు ఘటనలో చనిపోయిన కుటుంబాలకు చెందిన పిల్లలను కూడా దత్తత తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే చనిపోయిన ప్రతీ కుటుంబానికి 10 లక్షల చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తోంది తెలుగుదేశం పార్టీ.