
తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారకరామారావు అనగానే టక్కున గుర్తొచ్చేది ” చైతన్య రథం ”. ఎన్టీఆర్ రాజకీయ చరిత్రలో చైతన్య రథంకు చెరిగిపోని చరిత్ర ఉంది. అన్న నందమూరి తారక రాముడిని యావత్ తెలుగు దేశం అంతటా ప్రయాణించేలా చేసిన రథమే ఈ చైతన్య రథం. అసలు చరిత్ర లోకి వెళితే …… సినిమారంగంలో రారాజుగా వెలుగొందుతున్న ఎన్టీఆర్ రాజకీయ రంగంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజలను చేరుకోవడానికి మొదట ఒక జీపు ద్వారా వెళ్ళాడు ఎన్టీఆర్. అయితే తనని చూడటానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తుండటంతో వాళ్ళ కోసం మరింత ఎత్తుగా ఉండే వాహనం ఉంటే మంచిదని అనుకున్నాడు ఎన్టీఆర్. తన పార్టీ నాయకులతో చర్చించిన సమయంలో రామకృష్ణా సినీ స్టూడియోస్ లో మూలన పడిఉన్న వాహనాన్ని చూసాడు ఎన్టీఆర్. దుమ్ము పట్టి ధూళితో నిరుపయోగంగా ఉన్న వాహనాన్ని తన ప్రయాణానికి అనుగుణంగా మార్పులు చేస్తే బాగుంటుందని భావించి అక్కడే ఉన్న హరికృష్ణకు ఆదేశాలు ఇవ్వడమే తరువాయి ఆ పాత వాహనాన్ని చైతన్య రథంగా మలిచేలా చేసాడు నందమూరి హరికృష్ణ.
అలా తయారైన వాహనమే ఈ చైతన్య రథం. ఈ పేరు కూడా పెట్టింది ఎన్టీఆర్ కావడం విశేషం. ప్రజలను చైతన్య పరచడానికి చైతన్య రథం ఎక్కి కదిలాడు ఎన్టీఆర్. ఇక ఈ చైతన్య రథసారధి ఎవరో తెలుసు కదా ఇంకెవరు నందమూరి హరికృష్ణ. తన తండ్రికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. రథసారధిగా నిలిచాడు.
1982 లో ఈ చైతన్య రథం ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగిందో తెలుసా …. 35 వేల కిలోమీటర్లకు పైగా. యావత్ ఆంధ్రదేశాన్ని ఈ చైతన్య రథం మీదే చుట్టేశాడు ఎన్టీఆర్. ప్రజలు అఖండ విజయాన్ని కట్టబెట్టారు. దాంతో అప్పటి నుండి ప్రతీ ఎన్నికల సమయంలో ఆ చైతన్య రథాన్ని ఉపయోగించాడు.
మార్చి 29 న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్బంగా నిన్న హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగిన వేడుకలలో చైతన్య రథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలుగు తమ్ముళ్లు చైతన్య రథంను మళ్ళీ మళ్ళీ చూస్తూ అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. 83 సంవత్సరాల క్రితం వాహనం ఈ చైతన్య రథం. అయినా చెక్కు చెదరకుండా ఓ మధురానుభూతిగా నిలిచింది చైతన్య రథం.






