తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు షాకిచ్చాడు తనయుడు నారా లోకేష్. గత నెల రోజులుగా నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఆ పాదయాత్రలో భాగంగా అన్నమయ్య జిల్లాలోని పీలేరు బహిరంగ సభలో ప్రసంగించాడు. అంతేకాదు పీలేరు అసెంబ్లీ నియోజక వర్గ అభ్యర్థిగా కిషోర్ కుమార్ రెడ్డిని ప్రకటించాడు. 2024 లో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కిషోర్ కుమార్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తే పీలేరు అభివృద్ధి కోసం మరింతగా కష్టపడతతామని, అందుకు పూర్తి బాద్యత నాదని స్పష్టం చేశాడు నారా లోకేష్. అయితే పార్టీ అధినేతగా నారా చంద్రబాబు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాలి. లేదంటే ఆయన ఖరారు చేసిన అభ్యర్థులను మాత్రమే మిగతా నాయకులు చెప్పాల్సి ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా నారా లోకేష్ పీలేరు అభ్యర్థిని ప్రకటించడం గమనార్హం. అంతేకాదు ఏపీ లో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నాడు చంద్రబాబు. పొత్తు ఇంకా ఖరారు కాకపోయినప్పటికి పొత్తు ఉండే సూచనలు మాత్రం కనిపిస్తున్నాయి. ఒకవేళ పొత్తు కుదిరితే ఈ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి అనే సీట్ల సర్దుబాటు ఉంటుంది. ఇలాంటి సమయంలో ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించడం వల్ల జనసేన మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది. దాంతో పొత్తుల విషయంలో కూడా ప్రతిష్టంభన నెలకొనే అవకాశం ఉంటుంది.
ఇక జగన్ ప్రభుత్వం ఇటీవల చేసుకున్న ఒప్పందాలన్ని వట్టి బూటకమని జగన్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగాడు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ బూటకపు ఒప్పందాల గురించి సవివరంగా తెలియజేయనున్నాడని తెలిపాడు నారా లోకేష్. నా పాదయాత్ర ను ఆపడానికి జగన్ ఎన్నో కుయుక్తులు పన్నుతున్నాడని, అయితే జగన్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా నా పాదయాత్రను అడ్డుకోవడం సాధ్యం కాదన్నాడు. 400 రోజుల పాటు ప్రజల్లో ఉండటం కోసమే వచ్చాను…… ప్రజలకు అండగా ఉంటాను సైకో జగన్ పాలనను తుడముట్టించి సైకిల్ పాలన తీసుకొచ్చేంత వరకు విశ్రమించేది లేదన్నాడు నారా లోకేష్.