కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్. అవినాష్ రెడ్డికి సీబీఐ మళ్లీ నోటీసులు పంపించింది. నాలుగు రోజుల క్రితం ఎంపీకి నోటీసులు పంపిన సీబీఐ ఈరోజు హైదరాబాద్ లో సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా కోరింది. అయితే మార్చి 6 న తన పార్లమెంట్ నియోజకవర్గంలో ముందుగా నిర్ణయించిన పలు కార్యక్రమాలు ఉన్నందున హైదరాబాద్ కు రాలేనని , విచారణకు హాజరు కాలేనని లేఖ రాశారు అవినాష్ రెడ్డి.
ఎంపీ లేఖతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే తీవ్ర తర్జన భర్జన అనంతరం సీబీఐ కొత్తగా మళ్లీ నోటీసులు పంపించింది. ఈనెల 10 న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి కూడా ఈనెల 12 న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే కడపలోనే భాస్కర్ రెడ్డిని విచారించనుంది సీబీఐ. అవినాష్ రెడ్డిని మాత్రం హైదరాబాద్ లో విచారించనుంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు అలాగే అన్ని వేళ్ళు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి. దాంతో ఈసారి అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదని భావిస్తున్నారు రాజకీయ పరిశీలకులు. సీబీఐ ఛార్జ్ షీట్ లో సైతం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీదే ఆరోపణలు పేర్కొన్న విషయం తెలిసిందే.