
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడులో సరికొత్త జోష్ మొదలైంది. గత నాలుగేళ్లుగా తెలుగుదేశం పార్టీ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. 2019 ఎన్నికల్లో పార్టీకి ఘోర ఓటమి ఎదురయ్యింది. కేవలం 23 అసెంబ్లీ స్థానాలు మాత్రమే దక్కాయి. అంతేకాదు మూడు పార్లమెంట్ స్థానాలలో మాత్రమే విజయం వరించింది. ఇక అప్పటి నుండి టీడీపీ ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.
చివరకు పార్టీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలలో నలుగురు వైసీపీ పంచన చేరడం కూడా బాబును కొద్దిగా కృంగదీసింది. దానికి తోడు వైసీపీ నాయకులు చంద్రబాబును అలాగే నారా లోకేష్ ను మాత్రమే టార్గెట్ చేయకుండా ఇంట్లో మహిళలను కూడా టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసారు. దాంతో చంద్రబాబు కుమిలిపోయాడు. సుదీర్ఘమైన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ కన్నీళ్లు పెట్టుకోని చంద్రబాబు మీడియా ముందు గుక్కపెట్టి ఏడ్చాడు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్రంగా కలిచి వేసింది.
అయితే వైసీపీ నాయకులు ఎంతగా టార్గెట్ చేసినప్పటికీ చంద్రబాబు మాత్రం తన పోరాటాన్ని ఎక్కడా ఆపలేదు. 73 ఏళ్ల వయసులో కూడా పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఆ పోరాటానికి ఎట్టకేలకు ఫలితం దక్కింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో మూడుకు మూడు స్థానాలు కూడా టీడీపీ కైవసం చేసుకుంది. అది మాత్రమే కాకుండా ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ స్థానంలో కూడా టీడీపీ సంచలన విజయం సాధించి చరిత్ర సృష్టించేలా చేసాడు చంద్రబాబు. టీడీపీ నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకోవడంతో అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటుగా టీడీపీ శ్రేణులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. 2024 లో జరగబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించబోతోంది అనే సంకేతం ఇదే అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.