నాకు 2024 ఎన్నికలే చివరి ఎన్నికలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఏపీలో రోజు రోజుకు రాజకీయాలు రంజుగా మారుతున్న విషయం తెలిసిందే. ఏపీ అసెంబ్లీకి 2024 ఏప్రిల్ లోపు ఎన్నికలు జరగాల్సి ఉంది. దాంతో ఏడాది కంటే ఎక్కువ సమయం ఉన్నప్పటికీ అప్పుడే అన్ని రాజకీయ పక్షాలు సర్వసన్నద్దం అవుతున్నాయి. ఇక ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అయితే ఏపీలోని 175 స్థానాలకు 175 స్థానాలు గెలవాల్సిందే అని కంకణం కట్టుకొని మరీ చంద్రబాబు ను టార్గెట్ చేస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబును అధికారం లోకి రాకుండా అడ్డుకుంటే రాబోయే 30 ఏళ్ల పాటు మనదే అధికారం అంటూ వైసీపీ నాయకులలో అలాగే కార్యకర్తలలో ఉత్సాహం ఉరకలు వేసేలా చేస్తున్నాడు.
దాంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు డీలా పడకుండా చంద్రబాబు కూడా మాస్టర్ ప్లాన్ వేసాడు. 2024 లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే మళ్లీ కోలుకుని నిలబడటం కష్టం కాబట్టి , అలాగే వయసు మీద పడుతుండటంతో 2024 తర్వాత అంతగా యాక్టివ్ గా ఉండే పరిస్థితి ఉండదు కాబట్టి 2024 ఎన్నికలే నాకు చివరి ఎన్నికలు అంటూ సంచలన ప్రకటన చేసాడు నారా చంద్రబాబు నాయుడు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ను ఓడిస్తే తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని , ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ బాగుంటుందని లేకపోతే అంధకారమే అవుతుందని అందుకోసం టీడీపీ కార్యకర్తలు మరింతగా శ్రమించాలని పిలుపునిచ్చాడు.
చంద్రబాబు వయసు ఇప్పుడు 72 సంవత్సరాలు దాంతో 2029 నాటికి మళ్లీ పోటీ చేసే అవకాశం ఎలాగూ ఉండదు కాబట్టి 2024 ఎన్నికలే నాకు చివరి ఎన్నికలు అని కార్యకర్తలకు స్పష్టం చేశాడన్న మాట. టీడీపీ పార్టీనే లేకుండా చేయాలని జగన్ , జగన్ ను ఓడించాలని చంద్రబాబు పంతం పట్టారు. మరి ఏపీ ప్రజలు ఎవరి తలరాతను మారుస్తారో తెలియాలంటే మరో ఏడాదిన్నర కాలం పాటు ఎదురు చూడాల్సిందే.