Pawan received support జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల వలంటీర్ల వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు ఏపీలో సంచలనమయ్యాయి. ఇంకా వాటి దుమారం తగ్గలేదు. వైసీపీ శ్రేణుల్లో పెద్ద అలజడి రేపిన ఈ అంశంపై ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్పందించారు. వలంటీర్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకరకంగా వారికి హెచ్చరికలు జారీ చేశారు. వలంటీర్లు రాజకీయాలు చేయొద్దని వారికి హితవు పలికారు. కొందరు వలంటీర్లు చేస్తున్న పనులపై తమకు పూర్తిస్థాయి సమాచారం ఉందని, అందరినీ ఇందులో భాగస్వాములను చేయడం లేదని చెప్పుకొచ్చారు. అయితే తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు.
టీడీపీ శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. రాష్ర్టంలో గత నాలుగేళ్లలో 52 వేలమంది మహిళలపై దాడులు జరిగాయని, ఏకంగా 22 వేలమంది అదృశ్యమయ్యారని కామెంట్ చేశారు. తాడిపల్లిగూడెంలో ని సీఎం ఇంటికి అతిసమీపంలో సామూహిక అత్యాచారం జరిగితే నేటికీ ప్రధాన నిందితుడిని పట్టుకోలేదని మండిపడ్డారు. ఈ సందర్భంగా వలంటీర్ల వ్యవస్థపై కూడా స్పందించారు. పవన్ తర్వాత ఆ స్థాయిలో టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించడం ఇప్పుడు ఏపీలో మరోసారి చర్చనీయాంశమైంది. అయితే వైసీపీ మాత్రం వలంటీర్లకు అనుకూలంగా ప్రెస్మీట్లు పెడుతూనే ఉంది. ఏదేమైనా ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు, అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వలంటీర్ల వ్యవస్థను టార్గెట్ చేయడం వెనుక ఏదో బలమైన వ్యూహం ఉన్నట్లుగా కనిపిస్తున్నది. వీరిద్దరు ఏదో ప్లాన్ ప్రకారమే ప్రజల్లో వలంటీర్ల అంశం పై చర్చ పెట్టారని టాక్ వినిపిస్తున్నది.
ప్రజల వ్యక్తిగత వివరాలతో వలంటీర్లకు ఏంపని అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. కుటుంబానికి చెందిన ప్రతి విషయాన్ని వలంటీర్లు కూపీ లాగుతున్నారని, ఇవన్నీ వారికి ఎందుకని ఆయన నిలదీశారు. ఈ ముఖ్యమంత్రి కారణంగా అధికారులు సెలవుల్లో వెళ్తున్నారు. వలంటీర్లు మిగతా పనులు చేస్తున్నారని మండిపడ్డారు. వలంటీర్లు రాజకీయాలు చేయొద్దని సూచించారు. వైసీపీ నేతలు చెప్పినట్లు పనులు చేస్తే మీకే నష్టమని చెప్పుకొచ్చారు. ఇన్నాళ్లు తన మంచితనం చూశారని, ఈ సారి తనేమిటో చూపిస్తానని హెచ్చరించారు. అయితే పవన్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన వైసీపీ శ్రేణులు ఇప్పుడు చంద్రబాబు తాజా వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.