
తెలుగుదేశం పార్టీలో ఆ భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ టీడీపీ కి పట్టుకున్న భయం ఏంటో తెలుసా……. బీజేపీ. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ , జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుని ఘన విజయం సాధించాయి. ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు కానీ టీడీపీ , బీజేపీ మాత్రం లాభపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చాయి. అయితే మధ్యలోనే కలహాలు చెలరేగి ఎవరికి వారే యమునా తీరే అయ్యారు. కట్ చేస్తే 2019 ఎన్నికల్లో ఏపీ లో విడివిడిగా పోటీ చేశారు ……. మూడు పార్టీలు కూడా ఘోర పరాజయం పొందారు. తెలుగుదేశం అధికారం కోల్పోయింది. జనసేన ఒక సీటు గెలిచినప్పటికి అతడు వైసీపీ పంచన చేరాడు. ఇక బీజేపీ అయితే దారుణంగా ఓడిపోయింది.
ఇక ఇప్పుడేమో వైసీపీని నిలువరించడం కోసం మళ్లీ పొత్తుల రాజకీయాలు మొలకెత్తాయి. బీజేపీ అయితే టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని కుండబద్దలు కొడుతున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని డిసైడ్ అయ్యాడు. అందుకే టీడీపీతో కలిసి పోటీ చేస్తేనే వైసీపీని ఓడించగలమని అంటున్నాడు. ఒకవేళ టీడీపీ , బీజేపీ , జనసేన కలిసి పోటీ చేస్తే బీజేపీ మీద తీవ్ర వ్యతిరేకత ఉన్న ఏపీ వాసులు తప్పకుండా ఈ కూటమిని ఓడించడం ఖాయమని, మళ్లీ వైసీపీ ని గెలిపించడం ఖాయమని తాజాగా ఆత్మసాక్షి సర్వే వెల్లడించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఆత్మసాక్షి సర్వే ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ ఆంధ్రుల్లో మాత్రం భారతీయ జనతా పార్టీ మీద చాలా కోపంగా ఉన్నారు. ఆంధ్రుల కోపానికి చాలా కారణాలు ఉన్నాయి. మొదటగా రాష్ట్రాన్ని విభజించడం ……. విభజన ఆంధ్రులకు అస్సలు ఇష్టం లేదు. ఒకవేళ విడిపోయామని భావించినప్పటికీ ….. ఏపీ కి స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోవడం , వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టడం , వైజాగ్ కు రైల్వే జోన్ ఇవ్వకపోవడం , పోలవరం పూర్తి చేయకపోవడం ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉంది. ఇవన్నీ జరగకపోవడానికి కారణం ముమ్మాటికీ బీజేపీ అని నమ్ముతున్నారు దాంతో బీజేపీ మీద చాలా కోపంగా ఉన్నారు. అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎక్కడ మనకు అన్యాయం జరుగుతుందో అనే భయం నెలకొంది టీడీపీ నాయకుల్లో. జనసేన – టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఏపీలో అధికారం దక్కడం ఖాయమని, బీజేపీ ని కూడా కలుపుకుంటే నష్టమని భావిస్తున్నారట టీడీపీ అధిష్టానం. దాంతో రాజకీయంగా ఎలాంటి ముందడుగు వేయాలనే దానిమీద గందరగోళం నెలకొందట.