వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తాడేపల్లి ప్యాలెస్ హస్తముందని సంచలన ఆరోపణలు చేసాడు మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగిన డీఎల్. రవీంద్రా రెడ్డి ఆతర్వాత జగన్ పార్టీలో చేరాడు. అయితే అక్కడ తనకు తగిన గౌరవం లభించడం లేదని తీవ్ర అసంతృప్తికి లోనై జగన్ పార్టీకి హ్యాండిచ్చాడు.
తాజాగా మీడియా ముందుకు వచ్చిన డీఎల్ వివేకా హత్యకేసులో అసలైన నిందితులు ఎవరనేది త్వరలోనే సీబీఐ నిగ్గు తేల్చనుందని వ్యాఖ్యానించాడు. అంతేకాదు వివేకా హత్య కేసులో తాడేపల్లి ప్యాలెస్ ను కూడా విచారించాలని డిమాండ్ చేసాడు. తాడేపల్లి ప్యాలెస్ అంటే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారిక నివాసం అనే విషయం తెలిసిందే.
ఇక మైదుకూరు ఎమ్మెల్యే పై తీవ్ర ఆరోపణలు చేసాడు డీఎల్. మైదుకూరు బార్లలో అలాగే మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని , ఆ అవినీతికి సంబందించిన అన్ని వివరాలు ఇచ్చినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసాడు డీఎల్ రవీంద్రా రెడ్డి.