వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సంచలన విజయం సాధించి అధికారం చేపట్టిన యోధుడు. 1972 డిసెంబర్ 21 న వైఎస్ రాజశేఖర్ రెడ్డి – వైఎస్ విజయమ్మ దంపతులకు జన్మించిన జగన్మోహన్ రెడ్డి మొదట వ్యాపారవేత్తగా తన జీవిత ప్రయాణాన్ని కొనసాగించాడు. అయితే 2004 లో తండ్రి ముఖ్యమంత్రి కావడంతో క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని ఉబలాటపడ్డాడు.
అయితే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వైఎస్ వివేకానంద రెడ్డి రాజీనామాకు ఒప్పుకోకపోవడంతో అప్పటి ప్రయత్నం విఫలమైంది. అయితే పట్టుబట్టి 2009 లో మాత్రం కడప పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి విజయం సాధించాడు. అయితే 2009 లో సెప్టెంబర్ 2 న తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించడంతో తీవ్ర షాక్ కు లోనయ్యాడు. అయితే తనని ముఖ్యమంత్రిని చేస్తారని అనుకున్నాడు కానీ సోనియా మనోగతం మరోలా ఉండటంతో పాటుగా తన తండ్రి కోసం మరణించిన కుటుంబాలను కలవడానికి పూనుకున్నాడు.
అయితే ఓదార్పు యాత్రకు సోనియా సమ్మతించలేదు. దానికి తోడు తనని పక్కన పెట్టి కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడంతో కాంగ్రెస్ పార్టీకి అలాగే కడప పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేసి సంచలనం సృష్టించాడు. అంతేకాదు ” యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ” ని స్థాపించి మళ్ళీ లోక్ సభకు పోటీ చేసి అఖండ మెజారిటీతో పార్లమెంట్ లో అడుగుపెట్టాడు.
2014 ఎన్నికల్లో అధికారం అందనప్పటికీ పట్టుదలతో 2019 లో మాత్రం అఖండ విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాడు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వారసులు రాజకీయంగా ఈ స్థాయి విజయాలను అందుకున్న దాఖలాలు లేవు. ఆ అరుదైన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంతం అనే చెప్పాలి. జగన్ ను తీవ్ర స్థాయిలో విమర్శించే వాళ్ళు ఉన్నప్పటికీ , అదే స్థాయిలో అభిమానించే వాళ్ళు కూడా ఉన్నారు. దాంతో రాజకీయంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. ఇక ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కావడంతో ఏపీ అంతటా జగన్ నామస్మరణతో దద్దరిల్లిపోతోంది. అట్టహాసంగా తమ అభిమాన నాయకుడి జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నారు వైసీపీ శ్రేణులు.