మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో రాజకీయ ప్రకటన చేయడంతో అది పెద్ద దుమారంగా మారింది. ”నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను కానీ రాజకీయం నానుంచి దూరం కాలేదు ” ఈ డైలాగ్స్ చిరంజీవి సోషల్ మీడియాలో వదిలాడు. ఇంకేముంది అవి వైరల్ గా మారాయి. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి వస్తానని అనుకుని భ్రమపడ్డాడు. కానీ ప్రజల ఆదరణ లేకపోవడంతో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రి అయ్యాడు.
ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం తీవ్రం కావడంతో రాష్ట్రం రెండుగా విభజింపబడింది. దాంతో పాటే ఆయన కేంద్ర మంత్రి పదవీకాలం కూడా అయిపొయింది. ఇక అప్పటి నుండి రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అలాగే మరోవైపు భారతీయ జనతా పార్టీ చిరంజీవిని రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండేలా చేయాలని చూస్తున్నారు కానీ కుదరడం లేదు.
కట్ చేస్తే చిరంజీవి వదిలిన డైలాగ్ ప్రకంపనలు సృష్టించింది. దాంతో మళ్ళీ చిరంజీవి రాజకీయాల్లోకి వస్తాడా ? అనే చర్చ మొదలయ్యింది. అయితే అసలు విషయం ఏంటంటే …… గాడ్ ఫాదర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో రూపొందుతుంది. అందులో కొన్నాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉంటాడు. మళ్ళీ తన సోదరికి కష్టాలు రావడంతో రాజకీయాల్లో అడుగు పెడతాడు. అదన్న మాట విషయం.