ప్రముఖ సినీ నటుడు అలీ ని ఏపీ మీడియా సలహాదారుడిగా జగన్ నియమించిన విషయం తెలిసిందే. 2019 లో ఎన్నికలకు ముందు జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు అలీ. అప్పుడే ఎక్కడైనా పోటీ చేసే చాన్స్ ఇస్తారని భావించారు అందరూ. కానీ అలా జరగలేదు. ఇక జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏదైనా కార్పొరేషన్ పదవి లభిస్తుందని ఊహాగానాలు వినిపించాయి. కట్ చేస్తే తాజాగా ఏపీ మీడియా సలహాదారు అలీ అంటూ ఉత్తర్వులు వెలువడ్డాయి. దాంతో పవన్ కళ్యాణ్ పై అలీ ని ప్రయోగించడానికే అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ – అలీ ఇద్దరు కూడా మంచి మిత్రులు. అయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టినప్పటికి అందులో అలీ జాయిన్ కాలేదు. పైగా ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసాడు. అప్పట్లో ఇది సంచలనంగా మారింది.
కట్ చేస్తే …… ఇటీవల కాలంలో జగన్ ప్రభుత్వం పై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నాడు. దాంతో అతడ్ని దెబ్బకొట్టడానికి అలీ ని ప్రయోగించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే అలీ ని కావాలనే ఏపీ మీడియా సలహాదారుడు గా నియమించారని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో మీడియా సాక్షిగా రసవత్తరమైన రాజకీయాలను చూడబోతున్నామన్నమాట.