కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అతిగారాబం చేస్తోందా ? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. 2019 లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి అత్యంత దారుణంగా హత్య చేయబడ్డాడు. అయితే హత్య అయినప్పటికీ తొలుత ఈ సంఘటనను గుండెపోటుతో మరణించాడని భావించేలా సహజ మరణంగా చూపించేలా తెరవెనుక పెద్ద మంత్రాంగమే నడిచింది.
రక్తపు మరకలను ఎంతగా తుడిచినా , వివేకాపై కత్తిపోట్లు మాత్రం పట్టించాయి. దాంతో తొలుత గుండెపోటుగా భావించిన పోలీసులు ఆ తర్వాత హత్య కేసుగా నమోదు చేసారు. అయితే తన తండ్రిని వైఎస్ అవినాష్ రెడ్డి , వైఎస్ భాస్కర్ రెడ్డి తదితరులు కలిసి చంపించారని తీవ్ర ఆరోపణలు చేస్తూ కోర్టుకెక్కింది వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు డాక్టర్ సునీత.
కోర్టు ఆదేశాలతో కేసు సీబీఐ చేతికొచ్చింది. అయితే సీబీఐ దర్యాప్తులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రధాన నిందితుడు అని తెలిసినప్పటికీ అతడ్ని అరెస్ట్ చేయడంలో మాత్రం తాత్సారం చేస్తోంది. ఎందుకంటే సీబీఐ తన ఛార్జ్ షీట్ లోనే వైఎస్ అవినాష్ రెడ్డి ప్రధాన నిందితుడు అని పేర్కొంది. కానీ ఇప్పటి వరకు అతడ్ని అరెస్ట్ చేయకపోగా …… విచారణకు రండి …. రండి అంటూ బ్రతిమిలాడుకుంటోంది. గత నెలలో కూడా అవినాష్ రెడ్డి ని విచారణకు రావాలని సీబీఐ కోరింది.
అయితే తనకు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నాయని , విచారణకు హాజరు కాలేనని సీబీఐకి లేఖ రాసాడు. కట్ చేస్తే ఈరోజు కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ ముందు హాజరు కావాల్సి ఉండే. కానీ తనకు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నాయని దాంతో విచారణకు రాలేనని పేర్కొన్నాడు. దాంతో రాజకీయ వర్గాల్లో పలు ఊహాగానాలు వస్తున్నాయి. నిందితుడు అని తెలిసాక అరెస్ట్ చేయాల్సింది పోయి …… విచారణకు రావాలని పదేపదే సమన్లు పంపించడం ఏంటో ? అతిగారాబం కాకపోతే అంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కాస్త ఆలస్యమైనా సరే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదు అని తెలుస్తోంది.