నిన్న మాచర్ల లో జరిగిన దాడులను తీవ్రంగా ఖండించింది జనసేన పార్టీ. ఆమేరకు రాజకీయ తీర్మానం చేసింది జనసేన. మాచర్లలో జరిగిన దాడి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని, ప్రజాస్వామ్య వాదులంతా ఆ సంఘటనను ఖండించాలని పిలుపునిచ్చారు మాజీర్ స్పీకర్ , జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంటే పోలీసులు చోద్యం చూడటం దారుణమని , వైసీపీ శాశ్వతంగా అధికారంలో కొనసాగాలని చూస్తోందని దుయ్యబట్టారు మనోహర్.
ఇక కౌలు రైతులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని, అందుకే చనిపోయిన కౌలు రైతు కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి జనసేన తరుపున లక్ష రూపాయలు ఇస్తున్నామని ఇది పవన్ కళ్యాణ్ కష్టార్జితమన్నారు. అయితే కౌలు రైతులు జనసేన సభకు రాకుండా , మేము ఇచ్చే లక్ష తీసుకుంటే ప్రభుత్వం ఇచ్చే 7 లక్షలు రావంటు అధికార పార్టీ భయపెడుతోందని ఇది సరైన పద్ధతి కాదన్నారు నాదెండ్ల మనోహర్. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు పెట్టినా జనసేన తలపెట్టిన కౌలు రైతు భరోసా కార్యక్రమం ఆగేది లేదని కుండబద్దలు కొట్టారు.