ఏపీ బీజేపీలో లుకలుకలు మొదలయ్యాయి. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ. తెలంగాణలో బండి సంజయ్ ని అలాగే ఏపీలో పవన్ కళ్యాణ్ ను బలహీనం చేయాలనే కుట్రలో భాగంగానే జగన్ – కేసీఆర్ ఒక్కటయ్యారని వాళ్ళ ఆటలు సాగనివ్వనని సంచలన వ్యాఖ్యలు చేసాడు కన్నా.
సోము వీర్రాజు వియ్యంకుడు కేసీఆర్ పార్టీ భారత్ రాష్ట్ర సమితి లో ఎలా చేరతాడాని, దానికి సోము సమాధానం ఏంటని నిలదీశాడు. ఇక అదే సమయంలో ఏపీలో పవన్ కళ్యాణ్ ను మరింత బలోపేతం చేయడానికి అతడికి అండగా ఉంటానని కన్నా లక్ష్మీనారాయణ అన్నాడు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగిన కన్నా లక్ష్మీనారాయణ 2014 లో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత భారతీయ జనతా పార్టీలో చేరాడు. ఆ వెంటనే కన్నా లక్ష్మీనారాయణను ఏపీ బీజేపీ అధ్యక్షుడు గా నియమించింది బీజేపీ అధిష్టానం.
అయితే కొన్నాళ్లకు కన్నా ను తప్పించి సోము వీర్రాజు కు పదవీ బాధ్యతలు అప్పగించింది. అయితే అప్పటి నుండి సోము – కన్నా ల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది. ఏపీలో ఎలాగూ బీజేపీకి అవకాశాలు లేవు కాబట్టి జనసేన పార్టీలో చేరడం ఖాయమని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కు అండగా ఉంటానని స్టేట్ మెంట్ ఇచ్చాడు కన్నా. దాంతో కన్నా జనసేనలో చేరడం ఖాయమా ? అనే చర్చ జరుగుతోంది.